తెలంగాణ

telangana

ETV Bharat / state

నేతన్నల వివరాలు ఇకపై ఆన్​లైన్​లో.. అందుకోసమేనంట..! - Loom details are registered online

Handloom workers Geotaging: రాష్ట్రంలో ఉన్న నేతన్నల వివరాలు ఆన్​లైన్​లో పొందిపరిచి వారికి ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా అందించేందుకు ప్రభుత్వం సన్నహాలు చేస్తోంది. దీని ద్వారా దళారుల వ్యవస్థకు స్వస్తి పలికి పథకాలు నేరుగా నేతన్నలకు వచ్చే విధంగా ప్రభుత్వం కార్యచరణ రూపోందిస్తోంది. మొదట విడతగా ఉమ్మడి జిల్లాలో కొన్ని గ్రామాలను పైలెట్​ ప్రాజెక్టుగా ఎంపిక చేసి చేనేత జౌళీశాఖ అధికారులు వివరాల నమోదు చేపడుతున్నారు.

Handloom workers Geotaging
Handloom workers Geotaging

By

Published : Jan 30, 2023, 6:55 PM IST

Handloom workers Geotaging: చేనేత కార్మికులకు పథకాల లబ్ధి అందించడంలో జాప్యం లేకుండా చూడటం, నేతన్నలకు సంబంధించి సమస్త వివరాల నమోదులో పారదర్శకత, దళారుల వ్యవస్థకు స్వస్తి పలికేలా ప్రభుత్వం నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. చేనేత మగ్గాల వివరాలన్నీ అంతర్జాలంలో నమోదు చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు మొదటి విడతగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కొన్ని గ్రామాలను పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసి చేనేత జౌళీశాఖ అధికారులు వివరాల నమోదు చేపడుతున్నారు. రానున్న మూడు నెలల్లో నేతన్నలున్న అన్ని గ్రామాల్లో ఇది అమలు చేయనున్నారు.

ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా దాదాపు 100కిపైగా గ్రామాల్లో మగ్గాలు నేసే కార్మికుల కుటుంబాలున్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 3,550 జియోట్యాగ్‌ మగ్గాలున్నాయి. వీటిపై ఆధారపడి దాదాపు 8 వేల కుటుంబాలుంటాయి. కొన్నేళ్ల క్రితం కార్వి సంస్థ ఇంటింటికి వెళ్లి మగ్గానికి ఒక జియోట్యాగ్‌ నెంబరు ఇచ్చి ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. అయితే ఇవి మగ్గం, ఒక కార్మికుడి వివరాలు మాత్రమే అందులో ఉన్నాయి.

దీంతో అందరి వివరాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో అందరి వివరాలు నమోదు చేసేందుకు పైలెట్‌ ప్రాజెక్టుగా వనపర్తి జిల్లాలో కొత్తకోట, జోగులాంబ జిల్లాలో ప్రాగటూరు, తుమ్మలపల్లి, మహబూబ్‌నగర్‌ జిల్లాలో అమిస్తాపూర్‌, నారాయణపేట జిల్లాలో కోటకొండ, చిన్నజట్రం గ్రామాలను ఎంపిక చేసి అధికారులు వివరాలు నమోదు చేస్తున్నారు.

జాప్యం లేకుండా.. : రాష్ట్ర ప్రభుత్వం చేనేత మిత్ర పేరుతో రేషం కొనుగోలుపై 40 శాతం రాయితీ అందిస్తున్నారు. ఇది ప్రతి 40 రోజులకోసారి మాష్టర్‌ వీవర్‌ బిల్లులు అప్‌లోడ్‌ చేస్తే కార్మికుల ఖాతాల్లో మూడు, నాలుగు నెలలకు డబ్బులు జమవుతున్నాయి. దీనిపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రస్తుతం అన్ని వివరాలు ఆన్‌లైన్‌ చేయడంతో బిల్లులు అప్‌లోడ్‌ లేకుండా నేరుగా కార్మికుల ఖాతాల్లో సమయానికి డబ్బు జమయ్యేలా చర్యలు తీసుకోనున్నారు.

త్రిఫ్టు ఫండ్‌ పథకంలో కార్మికులు సంపాదించిన దాంట్లో ప్రతి నెలా 8 శాతం జమ చేస్తే, ప్రభుత్వం 16 శాతం జమ చేస్తోంది. ఈ ప్రక్రియలో బ్యాంకులు అనుమతి లెటర్‌ ఇవ్వడంలో జాప్యం కారణంగా ఆలస్యం అవుతోంది. ఇకపై అలా కాకుండా చేనేత అధికారులు బ్యాంకుకు వెళ్లి ఎన్ని ఖాతాల్లో కార్మికులు జమ చేశారో గుర్తించి, అప్పటికప్పుడే ప్రభుత్వ డబ్బు జమ చేస్తారు. ఇక చేనేత బీమా అందించడంలోనూ జాప్యం లేకుండా చర్యలు తీసుకోనున్నారు.

నమోదు ఇలా..:మగ్గం ఉన్న లొకేషన్‌, పనిచేసే ప్రధాన కార్మికుడు, ఇద్దరు సహాయ కార్మికులు, అందరి ఆధార్‌, బ్యాంకు వివరాలు సేకరించడంతోపాటు, ఒక్కో మగ్గానికి 3 లేదా 4 ఫొటోలు సేకరించి టీఎస్‌ హ్యాండ్లూమ్‌ వెబ్‌సైట్‌లో నమోదు చేస్తున్నారు. ఇవి పూర్తయ్యాక అన్ని గ్రామాల్లో ప్రతి మగ్గం వివరాలు సేకరించనున్నట్లు చేనేత అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా వివరాల నమోదుకు జిల్లా కార్యాలయాల్లో వేధిస్తున్న సిబ్బంది కొరత అడ్డంకిగా మారనుంది.

బోగస్‌కు చెక్‌:ప్రస్తుతం చేపట్టనున్న ఆన్‌లైన్‌ ప్రక్రియతో మగ్గం లేకుండా జియోట్యాగ్‌ నెంబరు పొందిన వాటికి చెక్‌ పడనుంది. గతంలో కార్వీ సంస్థ జియో ట్యాగ్‌ సంఖ్య ఇచ్చే తరుణంలో కొందరు డబ్బులు ఇచ్చి, మరికొందరు పలుకుబడి ఉపయోగించి మగ్గాలు లేకుండా జియోట్యాగ్‌ పొంది ప్రస్తుతం ప్రభుత్వ పథకాల లబ్ధి పొందుతున్నారు. ఇలాంటి బోగస్‌ల బాగోతం బయటపడనుంది.

"మగ్గాలు, చేనేత కార్మికులకు సంబంధించిన పూర్తి వివరాలు ఆన్‌లైన్‌ చేయాలని ఆదేశాలున్నాయి. మొదట కొన్ని ఫైలెట్‌ గ్రామాలను ఎంపిక చేసి చేపడుతున్నాం. ఇక్కడ విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా నమోదు ఉంటుంది. దీంతో నిధులు అందడంలో పారదర్శకత, పథకాల అమలులో వేగం ఉంటుంది."- గోవిందయ్య, ఏడీ, చేనేత జౌళిశాఖ, గద్వాల

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details