తెలంగాణ

telangana

ETV Bharat / state

చిత్రలేఖనంలో రాణిస్తున్న బాలిక.. జాతీయస్థాయిలో అవార్డులు - వనపర్తి జిల్లా అమరచింతకు చెందిన బాలిక ప్రతిభ

ప్రతిభకు పేదరికం అడ్డు కాదన్నది అక్షరాలా నిజం చేస్తోంది వనపర్తి జిల్లా అమరచింతకు చెందిన ప్రవల్లిక. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకుంటూ జాతీయస్థాయిలో సత్తా చాటుతోంది. చేనేత కుటుంబానికి చెందిన ప్రవల్లిక తొమ్మిది తరగతిలోనే చిత్రలేఖనంలో రాణిస్తూ పలు అవార్డులు సాధించింది. తన ప్రతిభతో అంతర్జాతీయస్థాయిలో రాణించేందుకు కృషి చేస్తున్న ప్రవల్లికపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

girl talent in painting
చిత్రలేఖనంలో రాణిస్తున్నవనపర్తి జిల్లా అమరచింతకు చెందిన ప్రవల్లిక

By

Published : Mar 28, 2021, 7:09 PM IST

కుంచె చేత పడితే చాలు ఎలాంటి బొమ్మనైనా అచ్చు గుద్దినట్లుగా వేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపిస్తూ దూసుకెళ్తోంది ఓ బాలిక. వనపర్తి జిల్లా అమరచింతకు చెందిన ప్రవల్లిక చిత్రలేఖనంలో రాణిస్తోంది. అంతర్జాతీయస్థాయిలో తన ప్రతిభను చాటేందుకు సిద్ధమైంది. చదువుతోపాటు తనకు ఇష్టమైన చిత్రలేఖనంలో సాధన చేస్తూ రాష్ట్రస్థాయి జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటుతోంది.

చిత్రలేఖనంలో రాణిస్తున్న వనపర్తి జిల్లాకు చెందిన ప్రవల్లిక

పట్టణంలోని చేనేత కుటుంబానికి చెందిన ప్రవల్లిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఇంట్లోనే సాధన చేస్తూ చరవాణి ద్వారా చిత్రలేఖనం పోటీల్లో ఆన్​లైన్ ద్వారా పాల్గొంటుంది. ఈ ఏడాది జనవరి 2021 సెంట్రల్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్​మెంట్ రీసెర్చ్ మహారాష్ట్ర, పుణె ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో పాల్గొని జాతీయ స్థాయి చిత్రలేఖనం పోటీలకు ఎంపికైంది.

ప్రపంచ తెలుగు మహాసభల పోటీల్లో ప్రథమస్థానం

2017లో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో రాష్ట్రంలో బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను తెలిపే చిత్రంతో ప్రథమ బహుమతి సాధించింది. గతేడాది చిత్ర కార్ ఆల్ ఇండియా ఆర్ట్ కాంపీటీషన్ లో వినాయక చవితి పండగ రోజున కరోనా నివారణ పోరుపై వేసిన చిత్రానికి జ్యూరీ అవార్డు అందుకుంది. 'మన ఊరికి మన గురుకులం' పేరుతో నిర్వహించిన చిత్రలేఖనంలో జిల్లాస్థాయిలో మొదటి బహుమతి సాధించింది.

అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు

జాతీయ నాయకులు, కుటుంబసభ్యుల ముఖచిత్రాలు, పక్షులు, జంతువులు, దేవతల చిత్రాలు వేయడంలో ప్రవల్లిక ప్రావీణ్యం అద్భుతం. జాతీయస్థాయిలో మంచి గుర్తింపు రావడంతో ఇంటర్నేషనల్ స్థాయికి తన చిత్రాలను పంపింది. అంతర్జాతీయస్థాయి ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. బాలిక తల్లిదండ్రులు నిరుపేద కుటుంబానికి చెందిన వారు కావడంతో ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకుంటే భవిష్యత్తులో మరింత రాణించగలదని స్థానికులు, బంధువులు, స్నేహితులు కోరుతున్నారు.

ఇదీ చూడండి:వ్యవసాయ చట్టాలకు నిరసనగా ఏప్రిల్ 23న రైతు గర్జన సభ!

ABOUT THE AUTHOR

...view details