ఇంటిని ఎత్తేస్తూ... సెల్లార్ నిర్మిస్తా...! వనపర్తి జిల్లా కేంద్రంలో వెంకటేశ్ అనే దుకాణ దారుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తన భవనాన్ని 3 అడుగుల ఎత్తుకు లేపి కింద సెల్లార్ నిర్మిస్తున్నాడు. హర్యానాకు చెందిన ఓ ఏజెన్సీకి ఈ పనులు చేపట్టింది. భవనం అడుగున జాకీలను ఏర్పాటు చేసి దశల వారీగా పైకి ఎత్తుతూ వస్తున్నారు.
ఖర్చు సగం...
భవనాన్ని పూర్తిగా తొలగించి కొత్తది నిర్మించాలంటే రూ. 40 లక్షలు ఖర్చవుతుంది. ఇంటిని లిఫ్ట్ చేసే ఈ పరిజ్ఞానం ద్వారా రూ. 20 లక్షలతో పని పూర్తవుతుందని వెంకటేశ్ పేర్కొన్నాడు. అంతేకాక వ్యయప్రయాసలు పడాల్సిన పని లేదని చెబుతున్నాడు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంతో ఉపయోగకరంగా ఉందని అంటున్నాడు.
20 ఏళ్లుగా చేస్తున్నాం
ఈ విధానం ద్వారా 20 ఏళ్లుగా ఇంటి నిర్మాణాలను పైకి ఎత్తడం చేస్తున్నామని ఏజెన్సీ నిర్వాహకులు తెలిపారు. ఇప్పటివరకూ దాదాపు వంద ఇళ్లు పైకి ఎత్తామని పేర్కొన్నారు. ఈ పద్ధతి వల్ల ఎలాంటి సమస్యలు ఏర్పడవని అంటున్నారు.
ఇంటి ముఖచిత్రం మార్చాలనుకునే వారు దానిని పగలగొట్టకుండా స్థానచలనం చేసే ఈ విధానం ఎంతో బాగుంది కదూ...! మరెందుకు ఆలస్యం ఇంట్లో మార్పు చేయాలంటే మీరు కూడా ఈ పద్ధతి పాటించండి. తక్కువ ఖర్చుతో ఇల్లు పడగొట్టకుండా కట్టే దీని వల్ల అన్నీ ఉపయోగాలే మరి.
ఇదీ చూడండి : బొగత జలపాతం... ప్రకృతి రమణీయతకు నిలువుటద్దం