తెలంగాణ

telangana

ETV Bharat / state

అచేతనంగా కుమారుడు.. ఆదుకోవాలని తల్లి ఆవేదన - ఆదుకోవాలని తల్లి రోదన

The mother's desire to support her son: ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. పదో తరగతి వరకు చదువు చెప్పించారు. చదువుపై అనాసక్తి ఉండడాన్ని గమనించి.. అతనికి ఇష్టమైన పని చేయమని చెప్పారు. తల్లిదండ్రులు తనకు సహకరించడంతో.. జేసీబీ ఆపరేటర్​గా పని నేర్చుకున్నాడు. కుమారుడి సంపాదన కుటుంబానికి ఆర్థికంగా చేదోడువాదోడుగా కావడంతో.. ఆ తల్లిదండ్రులు ఎంతో మురిసిపోయారు. కుమారుడు చేతికందివచ్చాడన్న సంతోషం తీరక ముందే.. రోడ్డు ప్రమాదం రూపంలో విధి వారి ఇంట్లో విషాదాన్ని నింపింది. మోటార్​ సైకిల్​ రోడ్డు ప్రమాదానికి గురవడంతో వెన్నుముక విరిగిపోయి.. అచేతనంగా మారిన కుమారుడికి కన్నతల్లే... అన్ని సేవలు చేస్తూ... కంటికి రెప్పలా కాపాడుకుంటోంది.

mother story
mother story

By

Published : Dec 29, 2021, 12:14 PM IST

The mother's desire to support her son: వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలం కంబాలపురం గ్రామానికి చెందిన తెలుగు వీరన్న, జ్యోతి దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు రెండేళ్ల క్రితం వివాహమైంది. కుమారుడు మహేశ్​ పది వరకు చదువుకున్నాడు. పై చదువులపై ఆసక్తి లేకపోవడంతో... జేసీబీ ఆపరేటర్​గా పని నేర్చుకుని.. కుటుంబానికి ఆర్థికంగా చేదోడు అయ్యాడు. ఈ క్రమంలో 8నెలల క్రితం పని ముగించుకుని.. తన బైక్​పై ఇంటికి తిరిగి వస్తుండగా... వాహనం అదుపు తప్పి... కింద పడింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన మహేశ్​ను వనపర్తి జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్​ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం... ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించక తప్పలేదు. మహేశ్​ను పూర్తిగా పరిశీలించిన వైద్యులు.. వెన్నుముక భాగంలో విరిగిపోయిందని... అందుకు శస్త్రచికిత్స చేసి... మెరుగైన వైద్యం అందిస్తే.. కొంత కాలానికి కోలుకుంటాడని వైద్యులు సూచించారు.

మహేశ్​

దాతలు ముందుకు రావాలి...

చేసేదేమీ లేక.. అందినకాడికి అప్పులు తీసుకువచ్చి.. కుమారుడికి శస్త్రచికిత్స చేయించి.. మెరుగైన వైద్యం అందించారు తల్లిదండ్రులు. అప్పటికే 8 లక్షల వరకు అప్పులు కావడం వల్ల... తమకున్న ఎకరం పొలంలో అర ఎకరం అమ్మేసి... వచ్చిన డబ్బులతో కొంతవరకు అప్పులు తీర్చారు. కుమారుడి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వైద్యం కోసం మరో రెండేళ్ల పాటు వేచి చూడాల్సి రావడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో కుమారుడిని ఇంటికి తీసుకువచ్చి చికిత్సలు అందిస్తున్నారు. ఇక కుమారుడికి తల్లి జ్యోతి 24 గంటలు సేవలు చేస్తోంది. చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లి వచ్చే.. ఆర్థిక స్తోమత లేక.. ఇంటి దగ్గరే ఉంచుకుని వైద్య సేవలు అందిస్తుంది. ఆర్థికంగా పూర్తిగా కుంగిపోయి ఉన్నామని.. ఎవరైనా దాతలు సహకరిస్తే... తమ కుమారుడిని కాపాడుకుంటామని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

'రోజు పనికి పోతూ వస్తుండే.. కానీ ఓ రోజు యాక్సిడెంట్​ అయింది.. అప్పటి నుంచి మంచానికే పరిమితమయ్యాడు. డబ్బులు ఖర్చు పెట్టాం. కానీ ఇంకా మెరుగైన వైద్యానికి డబ్బులు అవసరమున్నాయి. ఎవరైనా వచ్చి ఆదుకోవాలి.'- మహేశ్​ తండ్రి

ఓవైపు తల్లిగా.. మరోవైపు భార్యగా సేవలు

ఇదిలా ఉండగా భర్త వీరయ్యకు పక్షవాతం రావడం వల్ల... భర్తకు సైతం తానే పూర్తి సపర్యలు చేస్తూ కాపాడుకుంటూ వస్తోంది. ఇంటి బాధ్యతలు మోస్తూ... కుమారుడికి కావాల్సిన సేవలందిస్తూ... భర్తకు పక్షవాతానికి సంబంధించిన సేవలు చేస్తూ.. ఇటు తల్లిగా.. అటు భార్యగా ఆదర్శప్రాయంగా నిలుస్తోంది జ్యోతి.

'ఇప్పటివరకు 8 లక్షలు ఖర్చు పెట్టాం. ఇంకా 2 లక్షల అప్పు ఉంది. భూమి అమ్ముదామని అనుకుంటున్నాం. మరోవైపు ఆయనకు పక్షవాతం వచ్చింది. ఎవరూ ఏం కష్టం చేయట్లేదు. వీరికి సేవ చేసేందుకు రోజు మొత్తం గడిచి పోతుంది. మా ఇల్లు గడవడమే కష్టమైంది. ఎవరైనా డబ్బు సాయం చేయాలని కోరుతున్నాం.' - మహేశ్​ తల్లి

ఎవరైనా దాతలు సహకరిస్తే తమ కుమారుడిని కాపాడుకుంటామని... రెక్కాడితే కాని డొక్కాడని తమ కుటుంబంలో పెనువిషాదం చోటు చేసుకోవడం వల్ల.. కుటుంబం పూర్తిగా ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయి ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: Daughter attack on mother for assets: 'ఆస్తి కాగితం రాస్తేనే... అన్నం పెడుతానంది'

ABOUT THE AUTHOR

...view details