వనపర్తి జిల్లా ప్రజల ఆరోగ్య సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తాను స్వయంగా జిల్లా ఆసుపత్రికి రెండు అంబులెన్సులను అందజేయనున్నట్లు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. గురువారం జిల్లా కలెక్టరేట్లో ఆసుపత్రి అభివృద్ధి అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. ఇటీవల మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా నాలుగు అంబులెన్సులను ఇచ్చేందుకు అంగీకరించారని.. ఈ మేరకు ఇదివరకే ఒకటి ఇవ్వగా.. మరో రెండింటిని జిల్లా ఆసుపత్రికి అందజేస్తామని.. రాష్ట్ర స్థాయిలో మరొక వాహనాన్ని ఇస్తామని మంత్రి వెల్లడించారు.
వనపర్తి జిల్లాలో మొదటి మూడు నెలలు కరోనా కేసులు లేకపోయినా.. అనంతరం కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చిందని మంత్రి అన్నారు. జిల్లాలో అందుబాటులో ఉన్న ఐసీయూ, బెడ్లు, తదితర వివరాలను వైద్య ఆరోగ్య అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో పనిచేసే ఉద్యోగులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని మంత్రి తెలిపారు. ఆస్పత్రి క్యాంటీన్‌ను రోగులు, డాక్టర్లు, సహాయకులకు ఇబ్బంది కలగకుండా తక్షణమే మెప్మా గ్రూపులకు అప్పగించాలని ఈ సమావేశంలో తీర్మానించారు.