కరోనా రెండోదశ వ్యాప్తి వేగంగా జరుగుతోన్న నేపథ్యంలో ప్రజలందరూ కచ్ఛితంగా మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం అడిషనల్ కలెక్టర్లు, డీఆర్డీవో అధికారులు, డీపీవోలు, జడ్పీ సీఈవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొవిడ్ ఉద్ధృతి దృష్ట్యా గ్రామ పంచాయతీ సెక్రటరీ, డీఆర్డీఏ అధికారులు, ఆశావర్కర్లు, వైద్య సిబ్బందితో సమన్వయం చేసుకుని పని చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా గ్రామాల్లో ప్రజలు తప్పనిసరిగా మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించేలా అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. ఐకేపీ సంఘాల ద్వారా మాస్కులను తయారుచేయించి.. గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. మాస్కులు ధరించని వారికి జరిమానాలు విధించాలని ఆదేశించారు. గ్రామాల్లో ఉపాధి హామీ పనులు నిర్వహించే వారికి మాస్కులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు.