వనపర్తి జిల్లా రేవల్లి మండలంలోని ఏదుల రిజర్వాయర్ ముంపు గ్రామమైన బండరవిపాకుల గ్రామస్థుల కోసం... ఏర్పాటు చేసిన తాత్కాలిక పునరావాసాల్లోకి వర్షపునీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులకు గురైనట్లు స్థానికులు తెలిపారు. అధికారులు ఏర్పాటు చేసిన పునరావాసం లోతట్టు ప్రాంతంలో ఉండడంతో తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షానికి పూర్తిగా జలమయమైంది.
ఇళ్లల్లోకి సైతం వర్షపు నీరు చేరడంతో వృద్ధులు, చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్థులు వాపోతున్నారు. రిజర్వాయర్ నిర్మాణంలో తమ గ్రామాన్ని కోల్పోతున్నామని... తమకు శాశ్వత పునరావాసాన్ని ఏర్పాటు చేయాలని పలుమార్లు అధికారులను కోరిన పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు ఏర్పాటు చేసిన తాత్కాలిక పునరావాసాల్లోకి నీరు చేరడం... వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని అన్నారు. భారీ వర్షాలు వస్తే తమకు చావే శరణ్యమని వాపోతున్నారు. విద్యుత్ సరఫరా కోసం ఏర్పాటుచేసిన స్తంభాలు తీగలు ఇళ్ల మధ్యలో నుంచి ఉన్నాయని తెలిపారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడపాల్సి వస్తోందన్నారు.