Lemongrass Products: రాష్ట్రంలో కనిపించే సుగంధద్రవ్య, ఔషధ మొక్కల పంటల్లో ప్రముఖమైనది నిమ్మగడ్డి. నిమ్మగడ్డి నుంచి ఉత్పత్తి చేసిన తైలాన్ని ఔషధాల్లో వాడతారు. సబ్బులు, షాంపూల్లాంటి ఉత్పత్తుల తయారీకీ వినియోగిస్తారు. నిమ్మగడ్డి తేనీరు ఆరోగ్యానికి మేలు. సేంద్రీయ విధానంలో పండించిన నిమ్మగడ్డికి, సహజ ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో మంచి డిమాండ్ ఉంది. వీటిని దృష్టిలో ఉంచుకుని నిమ్మగడ్డి సాగు ద్వారా రైతులకు, ఉత్పత్తుల తయారీ ద్వారా మహిళలకు మెరుగైన ఉపాధి కల్పించేందుకు ప్రయత్నిస్తోంది వనపర్తి జిల్లా యంత్రాంగం. కలెక్టర్ యాస్మిన్ బాషా చొరవతో పెద్దమందడి మండలం చీకురుచెట్టు తండాలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నిమ్మగడ్డి నూనె తయారీ కేంద్రం సత్ఫలితాలిస్తోంది.
జేఎల్‌జీ పేరిట:వివిధ సంఘాల నుంచి ఎంపికైన 10మంది ఔత్సాహిక మహిళలు, ఝాన్సీలక్ష్మీబాయి జేఎల్‌జీ పేరిట నిమ్మగడ్డి నూనె తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఇందుకోసం చుట్టుపక్కల 13 మంది రైతులతో 12 ఎకరాల్లో నిమ్మగడ్డిని సాగుచేయించారు. తొలిసారి కోతను టన్నుకు 5వేల చొప్పున సుమారు 40 టన్నుల గడ్డిని రైతుల నుంచి మహిళలే కొనుగోలు చేశారు. సేకరించిన నిమ్మగడ్డి నుంచి డిస్టిలేషన్ యూనిట్‌కు తరలించి అక్కడ నూనె తయారు చేస్తున్నారు. టన్ను నిమ్మగడ్డితో 10 లీటర్ల నూనె తయారవుతుందని, ఇప్పటి వరకూ నిమ్మగడ్డి నూనె విక్రయాల ద్వారా లక్షా 20వేల వరకూ ఆదాయాన్ని పొందినట్లు సంఘం అధ్యక్షురాలు మోతీబాయి వెల్లడించారు.
ఇతర పంటలతో పోల్చితే నిమ్మగడ్డి ద్వారా మంచి ఆదాయం లభిస్తోందని రైతులు చెబుతుంటే... నిమ్మగడ్డి నూనె తయారీ కేంద్రంతో ఉపాధి దొరుకుతోందని పలువురు మహిళలు తెలిపారు. మరోవైపు సాగు నుంచి ఉత్పత్తుల తయారీ వరకూ రసాయనాల్లేని సేంద్రీయ విధానాలు అనుసరిస్తున్నామని పేర్కొన్నారు.