KTR Wanaparthy Tour Updates :రాష్ట్ర ప్రజలు వరి ఒక్కటి మాత్రమే పండిస్తే సరిపోదని.. ఆయిల్‌పామ్ కూడా పండించాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ఐదేళ్లలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేయడమే లక్ష్యంగా ఎంచుకున్నామని తెలిపారు. వనపర్తి జిల్లాలోని సంకిరెడ్డిపల్లిలో ఏర్పాటు చేసిన ప్రీయూనిక్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆయిల్‌పామ్ కర్మాగారానికి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు.
KTR on Oil Palm Cultivation Telangana : వ్యవసాయ రంగంలో తెలంగాణ దూసుకుపోతుందని మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఆనాడు కేంద్రమంత్రి పీయూష్ గోయల్.. రైతులను కించపరిచే విధంగా మాట్లాడారని గుర్తు చేసుకున్నారు. అందుకే రాష్ట్రంలో వరి మాత్రమే పండిస్తే సరిపోదని.. ఆయిల్‌పామ్ కూడా పండించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా రైతులను ప్రోత్సహిస్తుందని హామీ ఇచ్చారు. ఆయిల్ పామ్ పండించే రైతులకు ప్రభుత్వం రాయితీలు కల్పిస్తుందని వివరించారు.