పొలికేక పెట్టాలే..!
దేశంలో 3 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, 70వేల టీఎంసీల సాగునీరు అందుబాటులో ఉన్నా... వాటిని సద్వినియోగం చేసుకునే శక్తి భాజపా, కాంగ్రెస్‌లకు లేదని సీఎం విమర్శించారు. 60 ఏళ్లకు పైగా దేశాన్ని పాలించిన పార్టీలు పరస్పర విమర్శలు చేసుకుంటూ.. పబ్బం గడుతున్నాయని మండిపడ్డారు. ఈ దారిద్ర్యాన్ని వదిలించేందుకు ఎవరో ఒకరు పొలికేక పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమి పగ్గాలు చేపట్టనుందని జోస్యం చెప్పారు.
ప్రధానిపై ఎదురుదాడి..
పాలమూరు సభలో ప్రధాని మోదీ తనపై చేసిన విమర్శలపై కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 2014 ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తానన్న మోదీ.. ప్రాజెక్టు నిధుల కోసం ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఎందుకు స్పందించలేదని ఎదురుదాడికి దిగారు. ఐదేళ్ల పాలనలో ప్రధాని దేశానికి చేసిందేమి లేదని విరుచుకుపడ్డారు. ఆసరా పింఛన్లకు కేంద్రం 200 కోట్లిస్తే... తెరాస సర్కారు 11వేల కోట్లు ఖర్చు చేస్తోందని గుర్తు చేశారు. ఎన్నికల్లో భాజపాకు డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు.