రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి వనపర్తి జలదిగ్బంధమైంది. పట్టణంలోని పలు కాలనీల్లోకి వరద వచ్చి చేరింది. తాళ్ల చెరువుకు నీటి ఉద్ధృతి ఎక్కువ కావడంతో పొంగిపొర్లుతోంది. శ్వేతానగర్ కాలనీ, శ్రీరామ టాకీస్, బ్రహ్మంగారి వీధిలోకి ప్రవాహం వచ్చింది. నివాసాలు, వ్యాపార సముదాయాల్లోకి వరదనీరు చేరింది.
పొంగిపొర్లిన తాళ్లచెరువు... జల దిగ్బంధంలో వనపర్తి
రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరిపిలేని వానకు... వనపర్తి జలదిగ్బంధమైంది. తాళ్లచెరువు పొంగిపొర్లడంతో రహదారులు, రోడ్లు అన్ని పూర్తిగా జలమయమైపోయాయి. నివాసాలు, వ్యాపార సముదాయాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
వనపర్తి- హైదరాబాద్ ప్రధాన రహదారిపైకి తాళ్లచెరువు వాగు ఉప్పొంగడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. శ్వేతానగర్ కాలనీ పూర్తిగా జలమయం కావడంతో కాలనీవాసులు ఇంటిలో నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. వెంకటేశ్వర ఆలయం సమీపంలోని ప్రధాన రహదారిపై రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. పీర్ల గుట్ట వైపు నుంచి వస్తున్న వర్షపునీరు రోడ్లను ముంచెత్తింది. అంబేడ్కర్ చౌరస్తా నుంచి రాజీవ్ చౌరస్తా మధ్య గల రోడ్డు పూర్తిగా నీటితో నిండిపోయింది. వనపర్తి గోపాల్‌పేట మధ్యనున్న ప్రధాన రహదారి జేరిపోతుల మైసమ్మ గుడి దగ్గర ఉన్న వాగు ఉప్పొంగడంతో... రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మునుపెన్నడూ లేని విధంగా పరిస్థితి ఏర్పడిందని... ఇంత భారీ వర్షం ఎప్పుడూ చూడలేదని వనపర్తివాసులు వాపోతున్నారు.
ఇదీ చూడండి:శ్రీరాం సాగర్‌కు వరద పోటు.. 40 గేట్లు ఎత్తి నీరు విడుదల