తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ అంజన్నకు మాంసాహారమే నైవేద్యం

అక్కడి అంజనేయ స్వామికి మేక, గొర్రె, కోళ్లను బలిచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ఆ మాంసాన్ని వండి ప్రసాదంగా పెడతారు. పూజల అనంతరం భక్తులు భుజిస్తారు. అదేంటి స్వామి వారికి మాంసాహారం పెట్టడం పాపంతో సమానం అంటారా? కాదులెండి అక్కడి హనుమంతుడిని భక్తులు నాన్‌వెజ్‌ అంజన్నగా కొలుస్తారు. దానికి పెద్ద కథే ఉంది. మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా! ఈ స్టోరీ చదవండి.

ఈ అంజన్నకు మాంసాహారమే నైవేద్యం

By

Published : May 29, 2019, 12:32 PM IST

Updated : May 29, 2019, 3:44 PM IST

వారణాసిలో సంకట మోచన హనుమ, పాట్నాలో మహావీర హనుమ, జమ్నానగర్ బాల హనుమ, గుండ్రని ముఖంతో కనిపించే సాలసార్ బాలాజీ హనుమ, పవళింపు సేవలో దర్శనమిచ్చే అల్హాబాద్ బడే హనుమ, నమక్కల్​లో ఆంజనేయర్... దేశంలో హనుమంతునికి ఎన్నో రూపాలు... మరెన్నో ఆలయాలు...ఒక్కో కోవెలకు ఒక్కో విశిష్టత. కానీ చింతలకుంటలోని మారుతి నిలయం దేశంలోని హనుమంతుడి గుళ్లకు పూర్తి భిన్నం.

ఈ అంజన్నకు మాంసాహారమే నైవేద్యం

మాంసాహారమే ప్రసాదం....

వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం పాతపాలెంలో చింతలకుంట వాయుపుత్రుడిని భక్తులు నాన్-వెజ్ ఆంజనేయుడిగా పిలుస్తారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా కొలుస్తారు. హిందూ దేవాలయాల్లో భగవంతునికి పూలు, పండ్లు, పంచభక్ష పరమాన్నాలు నైవేద్యంగా సమర్పిస్తే చింతలకుంట ఆంజనేయునికి మాత్రం మాంసాన్ని పెడుతారు. పూజల తర్వాత ప్రసాదంగా భుజిస్తారు. ఈ మధ్య మొదలైన సంప్రదాయం కాదిది.. తరతరాలుగా వస్తున్న ఆచారం.

ఆలయ చరిత్ర....

రావణ సంహారం తర్వాత మిగిలిన రాక్షసులు తాము ప్రాణాలతో ఉండాలంటే నరమాంసం కావాలని రామున్ని కోరారట. హనుమంతుడు కొలువై లేని చోట నరమాంస భక్షణకు రాముడు అనుతిచ్చారట. ఒక్క పాతపాలెం మినహా ఎక్కడా ఆంజనేయుడు లేని గ్రామం కనపడక రాక్షసులు ఆ ఊరిపై పడ్డారు. జనం పవన సుతున్ని శరణుకోరారు. స్వామి రాక్షసులతో యుద్ధానికి దిగారు. అంజనీపుత్రుడి ధాటికి తట్టుకోలేక.. నరమాంసం అక్కర్లేదు... ఏ జంతువుని బలిచ్చినా... ఆ రక్తంతో తమ క్షుద్బాధ తీర్చుకుంటామని రాక్షసులు వేడుకున్నారు. కరుణించిన స్వామి... భక్తులు బలిచ్చే జంతురక్తంతో ఆకలి తీర్చుకోవాలని సూచించారట. అప్పటి నుంచి పాతపాలెంలో ఆంజనేయస్వామికి భక్తులు... శక్తి మేరకు మేక, గొర్రె, కోళ్లను బలిచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు.

ప్రతి శని, సోమ, మంగళ, అమావాస్య రోజుల్లో వందల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. సంక్రాంతికి పెద్ద జాతర చేస్తారు. పర్వదినాల్లో వచ్చే భక్తుల సంఖ్య వేలల్లో ఉంటుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రవాసులూ మొక్కులు తీర్చుకుంటారు.

ఇదీ చూడండి:'శ్రీ రామ' నామ స్మరణతో మార్మోగిన 'అంజన్న' క్షేత్రం

Last Updated : May 29, 2019, 3:44 PM IST

ABOUT THE AUTHOR

...view details