వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్లో.. ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లోని నిరుపేద విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. రెండు గురుకులాల సొసైటీల్లో సుమారు 190 మందికి వైద్య కోర్సుల్లో సీటు దక్కే స్థాయి ర్యాంకులు వచ్చాయి. ఎస్సీ గురుకులాల్లోని 142, ఎస్టీ గురుకులాల్లోని 48 మంది విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు ఎస్సీ, ఎస్టీ గురుకులాల సొసైటీల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
వనపర్తి జిల్లాలోని తండాకు చెందిన దేజావత్ గిరిజ ఎస్టీ విభాగంలో 85వ ర్యాంకు సాధించారు. ఆమెకు ఎయిమ్స్‌లో సీటు దక్కే అవకాశం ఉందని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఎస్సీ కేటగిరిలో జి. అభిలాష్ 168వ ర్యాంకు, కె. వంశీధర్ 1233, వై. పూజిత 1969 ర్యాంకు సాధించారు. బీడీ కార్మికురాలి కుమార్తె నిఖిత, సైకిల్ మెకానిక్ కుమార్తె అమూల్య దేవి తదితరులు స్ఫూర్తిదాయక ర్యాంకులు సాధించారని తెలిపారు.