Ponguleti Srinivas comments on KCR : వనపర్తిలో పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఆత్మ గౌరవ సభకు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ ప్రజలకు కన్నీళ్లు, ఆవేదనలు మిగిలాయే తప్ప అమరవీరుల ఆశయాలు నెరవేరలేదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ ఫాం హౌస్కు నీళ్లందించేందుకు యుద్ధ ప్రాతిపదికన.. కాళేశ్వరం పూర్తి చేసిన సర్కారు.. పాలమూరు రంగారెడ్డి పథకంలోని 18 ప్యాకేజీల్లో ఒక్క ప్యాకేజీలోనైనా పనులు పూర్తి చేసిందా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ను గద్దెదించేందుకు కలిసి వచ్చే వారితో చర్చలు కొనసాగుతున్నాయని, ఏ పార్టీలో చేరబోతున్నది త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని పొంగులేటి తెలిపారు.
ఎన్నికల ప్రణాళికను ఎందుకు అమలు చేయలేదు? : రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షునిగా పనిచేసిన సమయంలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళికను భగవద్గీత, బైబిల్, ఖురాన్తో పోల్చిన నిరంజన్ రెడ్డి.. అధికారంలోకి వచ్చాక ఎన్నికల ప్రణాళికను ఎందుకు అమలు చేయలేదని.. జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. కర్ణాటకలో అధికార పార్టీకి వ్యతిరేకంగా వచ్చిన ఫలితాలే, తెలంగాణలోనూ పునరావృతం అవుతాయని.. బీఆర్ఎస్ తుడిచి పెట్టుకుపోవడం ఖాయమన్నారు. ఆత్మ గౌరవ సభ నిర్వహించిన పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి.. నిరంజన్ రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బినామీ పేర్లతో భూముల్ని పథకాల ద్వారా వచ్చే నిధుల్ని కాజేశారని ధ్వజమెత్తారు. ఈ సమావేశానికి జడ్పీ ఛైర్మన్, బీఆర్ఎస్ తిరుగుబాటు నేత.. లోక్ నాథ్ రెడ్డి హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది.