తెలంగాణ

telangana

By

Published : Jan 28, 2022, 9:21 PM IST

ETV Bharat / state

తహసీల్దార్​ మాయాజాలం.. బతికుండగానే చనిపోయినట్లు పత్రాలు.. ఆ తర్వాత

ప్రజలు కట్టే పన్నులను జీతాలుగా తీసుకుంటూ వారికి న్యాయం చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులే.. అన్యాయం చేస్తున్నారు. రాజకీయ నాయకుల అండదండలకు లోబడి.. డబ్బుకు ఆశపడి వారు చెప్పినట్టల్లా ఆడుతున్నారు. ఫలితంగా అసలైన లబ్ధిదారులను బతికుండగానే రికార్డుల్లో చంపేస్తూ వారి భూమిని ఇతరుల పేరు మీదకు పట్టా చేస్తున్నారు. వృత్తి ధర్మాన్ని మరిచి కాసులకు కక్కుర్తి పడి సామాన్యుల ఉసురుపోసుకుంటున్నారు. ఒకే జిల్లాలో ఒకరే తహసీల్దారు.. ఇద్దరు రైతులు బతికుండగానే వారు చనిపోయినట్లుగా మరణ ధ్రువీకరణ పత్రాలు సృష్టించిన ఘటనే అందుకు దృష్టాంతం.

Death certificate while the farmer is still alive
బతికున్నా మరణ ధ్రువీకరణ పత్రం

బతికి ఉన్న ఓ రైతు మరణించినట్లుగా తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి అతని పేరు మీద ఉన్న 16 గుంటల పొలాన్ని ఓ వ్యక్తికి అమ్మినట్లుగా రిజిస్ట్రేషన్​ కాగితాలు మార్చేశాడు ఓ తహసీల్దారు. కంగు తిన్న బాధితుడు ఆరేళ్లుగా న్యాయం పోరాటం చేస్తున్నారు. మరో కేసులో అదే తహసీల్దారు.. మరో రైతును రికార్డుల్లో చంపేసి ఏకంగా 12 ఎకరాల 30 గుంటల భూమిని పట్టా మార్పిడి చేశాడు. న్యాయం పోరాటం చేస్తున్న ఆ రైతు ఇటీవల మరణించారు. వనపర్తి జిల్లాలో ప్రస్తుత మిడ్జిల్​ తహసీల్దార్ శ్రీనివాసులు.. రెండు చోట్ల విధులు నిర్వర్తించగా ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన విషయాలివి. అధికారులతో మొరపెట్టుకున్నా ఫలితం లేదని తెలుసుకున్న రైతు, మరో రైతు కుమారుడు.. హైదరాబాద్​లోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​ను ఆశ్రయించారు.

బతికుండగానే తను మరణించినట్లుగా తప్పుడు ధ్రువపత్రాలు సృష్రించి తనకు తీవ్ర అన్యాయం చేసిన తహసీల్దార్​ శ్రీనివాసులుపై.. బాధిత రైతు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​లో ఫిర్యాదు చేశారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం చిలిమిల్ల గ్రామానికి చెందిన రైతు కుక్కన్న.. తనకు ఎకరం 15 గుంటల భూమి వారసత్వంగా వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అందులో నుంచి 16 గుంటల భూమిని అప్పటి పెబ్బేరు తహసీల్దార్​గా విధులు నిర్వహిస్తున్న(ప్రస్తుత మిడ్జిల్ తహసీల్దార్​) శ్రీనివాసులు.. 2015లో తాను మరణించినట్లు తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి... 2013లో మరణించిన తన తల్లి సువారమ్మ 2015లో రాములు అనే వ్యక్తికి అమ్మినట్లు రికారుల్లోకి ఎక్కించారని పేర్కొన్నారు. ఈ విషయంలో గత ఆరేళ్లుగా తాను న్యాయ పోరాటం చేస్తున్నానని ఫిర్యాదులో వివరించారు. జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తన భూమి కాజేయడానికి కారణమైన శ్రీనివాసులును విధుల నుంచి తొలగించి... తన భూమి తనకు దక్కేవిధంగా అధికారులను ఆదేశించాలని బాధిత రైతు కుక్కన్న... కమిషన్​ను వేడుకున్నారు.

తమకు న్యాయం చేయాలంటూ కమిషన్‌కు బాధితుల విజ్ఞప్తి

"నేను బతికుండగానే చనిపోయినట్లు తహసీల్దార్​ శ్రీనివాసులు రికార్డులు సృష్టించారు. రాజకీయ నాయకుల అండదండలతోనే ఇదంతా జరుగుతోంది. పోలీసు వ్యవస్థ కూడా సహకరించడం లేదు. నాకున్న 16 గుంటల భూమిని ఇతరులకు అమ్మినట్లు రిజిస్ట్రేషన్​ చేశారు." - కుక్కన్న, బాధిత రైతు

మరో కేసులో తహసీల్దార్​ శ్రీనివాసులుపై మరో వ్యక్తి ఫిర్యాదు చేశాడు. 2019లో వనపర్తి జిల్లా విపునగండ్ల తహసీల్దార్​గా పని చేసిన శ్రీనివాసులు.. తన తండ్రి శివన్న గౌడ్​ బతికుండగానే మరణించినట్లు రికార్డులు సృష్టించి.. తమ 12 ఎకరాల 30 గుంటల భూమిని పట్టా మార్పిడి చేశారని బాధితుడు శ్రీనివాస్ గౌడ్... కమిషన్​కు తెలిపాడు. అధికార పార్టీకి చెందిన స్థానిక మంత్రి అనుచరులకు తమ భూమిని వారి పేర్లపై రికార్డుల్లో ఎక్కించారని పేర్కొన్నాడు. ఈ విషయంపై హైకోర్టులో స్టే ఆర్డర్ తీసుకొచ్చినా తహసీల్దార్​.. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ పట్టా మార్పిడి చేశారని ఫిర్యాదులో వివరించాడు. న్యాయ పోరాటం చేస్తున్న తన తండ్రి శివన్న గౌడ్ ఇటీవల మరణించారని... డబ్బులకు అమ్ముడుబోయి తమ భూమిని ఇతరులకు ధారాదత్తం చేసిన తహసీల్దార్​ శ్రీనివాసులుపై చర్యలు తీసుకోవాలని ఆయన కమిషన్​ను కోరాడు.

"గతంలో మా తండ్రి శివన్న గౌడ్​ చనిపోయినట్లుగా ధ్రువపత్రాలు సృష్టించి ఆయన పేరు మీదున్న 12 ఎకరాల 30 గుంటల భూమిని ఓ సామాజిక వర్గానికి చెందిన వారి పేరు మీద పట్టా చేశారు. దీనిపై మేము హై కోర్టు నుంచి స్టే ఆర్డర్​ కూడా తీసుకొచ్చాం. అయినా తహసీల్దార్​ శ్రీనివాసులు వాటిని బేఖాతరు చేశారు. మా తండ్రి ఇటీవల చనిపోయారు. మాకు న్యాయం జరుగుతుందనే ఆశతో మానవ హక్కుల కమిషన్​ను ఆశ్రయించాం." - శ్రీనివాస్​ గౌడ్​, బాధిత రైతు

ఇదీ చదవండి:తెరాసపై అనవసర ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు: మంత్రి ఎర్రబెల్లి

ABOUT THE AUTHOR

...view details