మహబూబ్‌నగర్ జిల్లాలో క్వింటాలుకు 5 నుంచి 7 కిలోల వరకు అధికంగా తూకం చేస్తున్నారు. దీనిపై కొందరు రైతులు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా ప్రస్తుతం బస్తాకు 2 కిలోలు తరుగు తీస్తున్నారు. నాగర్‌కర్నూల్, నారాయణపేట, వనపర్తి జిల్లాలో బస్తాకు 1.8 కిలోలు, జోగులాంబ గద్వాల జిల్లాలో 700 గ్రామాల చొప్పున తరుగు తీస్తున్నారు.
అధికారులు చూసీచూడనట్లుగా
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్వహకులు బస్తాకు 1.5-3 కిలోల వరకు అధికంగా తూకం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. తాలు, తేమ శాతం ఎక్కువగా ఉన్నందున కిలో నుంచి రెండు కిలోల వరకు ఎక్కువగా తీసుకుంటున్నట్లు కొందరు అధికారులే అంగీకరిస్తున్నారు. తూకం చేశాక లారీల్లో మిల్లర్ల దగ్గరకు తీసుకెళ్లేటప్పుడు ఆలస్యం కావడంతో తరుగు వస్తుందని అందుకే కొంత ఎక్కువ తూకం చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటుండటం గమనార్హం.
ఈ విషయమై వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాల పౌరసరఫరాలశాఖ అధికారులు రేవతి, వనజాత, నాగర్‌కర్నూల్, నారాయణపేట జిల్లాల మార్కెటింగ్ మేనేజర్లు బాలరాజు, హతీరాంలతో మాట్లాడగా నిర్ణయించిన తూకం కంటే ఎక్కువ తీసుకుంటే చర్యలు తీసుకుంటామని వారు స్పష్టం చేశారు. క్షేత్రస్థాయికి అధికారులు వెళ్లి పరిశీలించి తగు చర్యలు తీసుకుంటేనే రైతుకు న్యాయం జరుగుతుంది. అధికారులు ఆ వైపుగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
ఇలా సేకరించిన మొత్తాన్ని నిర్దేశించిన మిల్లులకు లారీల్లో పంపిస్తారు. ఒక లారీలో 650 నుంచి 680 బస్తాల వరకు మిల్లులకు చేరవేస్తున్నారు. అంటే ఒక బస్తా వెనక 2.700 కిలోల ధాన్యం అదనంగా మిల్లులకు వెళ్తుంది. 680 బస్తాల వద్ద 1,836 కిలోలను మిల్లర్లు ఎక్కువగా తీసుకుంటున్నారు.
* కొనుగోలు కేంద్రాల్లో 100 కిలోలను రైతుల నుంచి కొనుగోలు చేయాలంటే 40 కిలోల విలువ ఉన్నవి రెండు బస్తాలు, 20 కిలోలు ఉన్న ఒక బస్తాను తూకం చేయాలి. ఇలా చేసే సమయంలో ఒక బస్తా దగ్గర 2 కిలోల 700 గ్రాములు అదనంగా తీసుకుంటున్నారు. అంటే మూడు బస్తాలకు కలిపి ఏడు కిలోల వంద గ్రాములను కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతుల నుంచి తీసుకుంటున్నారు.
* రైతుల దగ్గర 40 కిలోల వరి బస్తాను తూకం చేసేందుకు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు 700 గ్రాముల వరి ధాన్యం తరుగుగా తీయాలి. ఈ తరుగు ఖాళీ సంచి బరువు మాత్రమే. ఖాళీ సంచీ 700 గ్రాములు ఉంటుంది. కావున అంతే మొత్తం తరుగును రైతు నుంచి తీసుకోవాలి.