అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతోనే జిల్లా అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జడ్పీ ఛైర్మన్ లోకనాథ్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి నిరంజన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కరోనా మరోసారి విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. దేశంలో వినియోగిస్తున్న వ్యాక్సిన్లలో సుమారు 30 నుంచి 40 శాతం హైదరాబాద్ నుంచి రావడం మనకు గర్వకారణమన్నారు. గ్రామాల నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజల్లో వ్యాక్సినేషన్‌పై ఉన్న అపోహలు తొలగించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని నిరంజన్‌రెడ్డి అన్నారు.
వచ్చే వారంలో..
పంట కాలువల్లో పేరుకుపోయిన ఒండ్రుమట్టిని ఉపాధిహామీ పథకం ద్వారా శుభ్రం చేయించాలని సూచించారు. వచ్చే వారం జిల్లా పరిధిలో 223 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం కచ్చితంగా ప్రతి గ్రామపంచాయతీలో ఏడాదికి నాలుగు సభలు నిర్వహించి.. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని, లేనిపక్షంలో గ్రామకమిటీని సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామ సభల్లో విద్యుత్, డీఆర్డీవో అధికారులు పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలని శ్రీరంగాపురం మండల జడ్పీటీసీ రాజేంద్రప్రసాద్ చేసిన సూచనను మంత్రి స్వాగతించారు.
రైతులను చైతన్య పరచాలి..
వ్యవసాయ, ఉద్యానవన శాఖలు సమన్వయంతో పనిచేయాలని.. రైతులకు సాంప్రదాయ వ్యవసాయ పంటలతో పాటు ఆయిల్ ఫామ్ తోటలు, మార్కెట్లో డిమాండ్ ఉన్నా పంటలను సాగు చేసే విధంగా సమావేశాలు నిర్వహించాలని సూచించారు. రైతులను చైతన్య పరిచాల్సిన బాధ్యత అధికారులు, ప్రతినిధులపై ఉందని మంత్రి అన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో మిషన్ భగీరథపై కేంద్ర మంత్రి ప్రశంసలు కురిపించారని మంత్రి గుర్తుచేశారు. మిషన్ భగీరథ ఇంజినీర్లను అభినందించారు.
ఇవీచూడండి:ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రజాసేవకు అవకాశంగా భావించాలి: కేటీఆర్