వచ్చే సంవత్సరం జనవరిలో కొవిడ్ వ్యాక్సిన్ను ప్రభుత్వం పంపిణీ చేసే అవకాశం ఉన్నందున అవసరమైన ఏర్పాట్లు చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ఆదేశించారు. మొదటి విడతలో.. డాక్టర్లు, నర్సులు, అంగన్వాడి , ఆశ కార్యకర్తలకు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. జిల్లాస్థాయి టాస్క్ఫోర్స్ సమావేశంలో కలెక్టర్ పలు విషయాలు వెల్లడించారు.
వర్గాలుగా విభజించి..
పోలీస్, ఆర్మీ ,మున్సిపల్, పంచాయతీరాజ్ ఉద్యోగుల తర్వాత ప్రజలకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఇందులోనూ యాభై ఏళ్లు పైబడినవారు, అంతకు తక్కువ వయసు ఉన్న వారిని వర్గాలుగా విభజించి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అందుకు అన్ని సౌకర్యాలున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, జిల్లా ఆస్పత్రులను గుర్తించాలని తెలిపారు.
అబ్జర్వేషన్ రూంల ఏర్పాటు..
ప్రతిచోటా వెయిటింగ్, వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత పరిశీలించేందుకు అబ్జర్వేషన్ రూంలను ఏర్పాటు చేయాలన్నారు. గదుల్లో 24 గంటల విద్యుత్ సౌకర్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సౌకర్యాలపై నిర్ధారణ చేసుకోవాలని తెలిపారు. ఏదైనా ఇబ్బంది తలెత్తితే జిల్లా ఆస్పత్రికి తరలించేందుకు అవసరమైన అంబులెన్సు, మందులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.