CM KCR Wanaparthy Tour: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయతలపెట్టిన 'మన ఊరు- మనబడి, మనబస్తీ- మనబడి' కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇవాళ లాంఛనంగా ప్రారంభించనున్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాల అందుకు వేదిక కానుంది. ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేసేదిశగా మనఊరు-మనబడి పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చింది. అందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని సర్కారీ బళ్లలో ఆంగ్లమాధ్యమ విద్యాబోధనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఈ పథకం కింద రూ.7,289 కోట్లతో ప్రభుత్వ పాఠశాలల్ని దశలవారీగా అభివృద్ధి చేయనున్నారు. మొదటి దశలో 9వేల123 పాఠశాలల్ని ఎంపిక చేశారు. 3వేల497 కోట్లతో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని వనపర్తి జిల్లా నుంచి ప్రారంభించనున్నారు.
సీఎం కేసీఆర్ పర్యటన ఇలా..
ప్రగతిభవన్ నుంచి బేగంపేట విమానాశ్రయం వెళ్లనున్న కేసీఆర్ అక్కన్నుంచి హెలికాప్టర్లో వనపర్తి జిల్లా పర్యటనకు రానున్నారు. ముందుగా వనపర్తి మండలం చిట్యాల వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడే నూతనంగా నిర్మించిన వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డును ప్రారంభిస్తారు. అక్కన్నుంచి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు చేరుకుని మనఊరు-మనబడి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. పైలాన్ ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత వనపర్తి తెరాస జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించి అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేస్తారు. భోజనానంతరం కలెక్టరేట్ నుంచి బయలుదేరి పక్కనే ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలకు శంకుస్థాపన చేస్తారు. అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. తిరిగి సాయంత్రం ఐదున్నర గంటలకు కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్లో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.
బహిరంగ సభకు భారీగా జనం