Cm KCR Districts tour:ముఖ్యమంత్రి కేసీఆర్ వరుస కార్యక్రమాలు, జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొననున్నారు. శుక్రవారం తెరాస ప్రజాప్రతినిధులతో తెలంగాణ భవన్‌లో సమావేశం కానున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ ఛైర్మన్ల సంయుక్త సమావేశం జరగనుంది. డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులతో పాటు రైతుబంధు జిల్లా కమిటీల అధ్యక్షులు, రాష్ట్ర స్థాయి కార్పోరేషన్ల ఛైర్మన్లు, తెరాస రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూడా సంయుక్త సమావేశంలో పాల్గొననున్నారు. ధాన్యం కొనుగోళ్లు, యాసంగి సాగు, కేంద్ర ప్రభుత్వ వైఖరి, ప్రభుత్వ ఆలోచనలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. భవిష్యత్ కార్యాచరణను ముఖ్యమంత్రి కేసీఆర్ నేతలకు వివరించనున్నారు.
కలెక్టర్లతో సమావేశం
CM meet with collectors: శనివారం జిల్లా కలెక్టర్లతో సీఎం సమావేశం కానున్నారు. ప్రగతిభవన్‌లో జరగనున్న భేటీలో మంత్రులు, సీనియర్ అధికారులు, కలెక్టర్లు పాల్గొంటారు. దళితబంధు పథకంతో పాటు ఇతర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. హుజూరాబాద్ సహా ఇప్పటికే ప్రకటించిన నాలుగు మండలాల్లో దళితబంధు అమలవుతోంది. ఆయా జిల్లాల కలెక్టర్ల ఖాతాకు నగదు కూడా బదిలీ చేశారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ మార్చిలోపు అమలు చేయాలని గతంలో నిర్ణయించారు. ఈ విషయమై కలెక్టర్ల సమావేశంలో చర్చిస్తారు. పోడు భూముల దరఖాస్తులు, పరిష్కారం, ధాన్యం సేకరణ, యాసంగి పంటల సాగు, పల్లెప్రగతి, పట్టణప్రగతి, హరితహారం, ధరణి సంబంధిత అంశాలు, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు సహా వివిధ అంశాలపై కలెక్టర్లు, అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్ధేశం చేయనున్నారు.