CM KCR: ‘నిరుద్యోగ యువత కోసం బుధవారం పొద్దున అసెంబ్లీలో నేను ప్రకటన చేస్తున్నా. పది గంటలకు అందరూ టీవీలు చూడండి.. ఏ విధమైన తెలంగాణ ఆవిష్కారమైందో, ఏం ప్రకటన చేయబోతున్నానో తెలుసుకోడానికి నిరుద్యోగులంతా ఉదయం 10 గంటలకు సిద్ధంగా ఉండాలి’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. వనపర్తిలో మంగళవారం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అణువణువునా తెలంగాణను జీర్ణించుకున్న శరీరంతో ఈ ప్రాంత ప్రగతి కోసమే చివరి రక్తం బొట్టు దాకా ప్రయత్నిస్తానన్నారు. ‘కులం, మతం, జాతి లేకుండా ప్రజలందరూ బాగుపడాలి. రాష్ట్రం రాకముందు నేను తెలంగాణ అభివృద్ధి గురించి చెప్పా. నన్ను అవమానపరిచారు. తెలంగాణ వచ్చాక ప్రగతి చూపించాను. ఇదే ప్రగతి, ఇదే పద్ధతి భారతదేశం అంతా రావాలి. దేశం కోసం కూడా పోరాటానికి ముందుకు పోవాలి’ అని అన్నారు. ‘పోదామా దేశం కోసం పోరాటానికి’ అంటూ సభికులను పలుమార్లు ప్రశ్నించగా ప్రజలు ‘పోదాం’ అంటూ సమాధానమిచ్చారు. ‘చివరి వరకు కొట్లాడుదామా’ అని ప్రశ్నించగా ‘వెళదాం’ అంటూ పిడికిలి బిగించారు. ‘దేశ్ కీ నేత కేసీఆర్’ అంటూ నినాదాలు చేశారు. ‘‘తెలంగాణ కోసం కొట్లాడినట్లే.. దేశంలో శాంతిని, సామరస్యాన్ని కాపాడటానికి అవసరమైతే ప్రాణం ధారపోయడానికి సిద్ధంగా ఉన్నా. మతపరంగా ప్రజల మధ్య చిచ్చుపెట్టడం మంచి పద్ధతి కాదు. చిల్లర రాజకీయాల కోసం దేశాన్ని బలి పెట్టే విషపు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ మేధావులు ఈ ప్రయత్నాలు తిప్పికొట్టాలి. గిరిజనుల రిజర్వేషన్లు పెంచాలని పంపితే మోదీ దానిని ముందుకు తీసుకెళ్లలేదు. వాల్మీకి బోయలు ఎన్నోరోజుల నుంచి కొట్లాడుతున్నారు.. వారి గురించి కూడా కేంద్రానికి పంపితే బేఖాతరు చేస్తోంది.
మూర్ఖపు పద్ధతిలో వ్యవహరిస్తోంది..
కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి ప్రజల డిమాండ్లు తెలియవు.. మూర్ఖపు పద్ధతిలో మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. మతపిచ్చి ఉన్నవాళ్లను కూకటివేళ్లతో పెకలించి బంగాళాఖాతంలో విసిరేయాలి. తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న కాషాయ జెండాకు, భాజపాకు బుద్ధి చెప్పాలి. - వనపర్తి సభలో సీఎం కేసీఆర్
వలసలు, ఆత్మహత్యలు లేవు..
ఈరోజు తెలంగాణలో ఆకలి చావులు లేవు.. ఆత్మహత్యలు లేవు.. కరవులు రావు.. వలసలు ఉండవు.. ఒక్క పాలమూరు నుంచే 15 లక్షల మంది వరకు వలస వెళ్లేవారు. ఆత్మహత్యలు, ఆకలి చావులు ఉండేవి. ఇప్పుడు రాయచూరు, కర్నూలు నుంచి కూలీలు పాలమూరుకు వలస వస్తున్నారు. ఎక్కడా లేనట్లు దళిత బిడ్డల కోసం రూ. 10 లక్షలు ఇస్తున్నాం. మళ్లీ ఆ డబ్బులు తిరిగి ఇచ్చేది లేదు.. నచ్చిన పని చేసుకుని బ్రహ్మాండంగా ముందుకుపోవాలి. దళిత బిడ్డలు కూడా పైకిరావాలి. దేశమే మన వద్ద నేర్చుకోవాలి. పేదింటి ఆడ బిడ్డలను ఆదుకోవడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. అవన్నీ గ్రామాల్లో మీ కళ్ల ముందు ఉన్నాయి. రాష్ట్రం వచ్చిన తరవాత ఎవరెన్ని చెప్పినా కచ్చితంగా ఉద్యమ జెండా పరిపాలనలోనే న్యాయం జరుగుతుందని ప్రజలు దీవించి అధికారం ఇచ్చారు. గతంలో మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక్క వైద్య కళాశాల కూడా లేదు. ఇప్పుడు 5 వచ్చాయి. ఆ మధ్య హైదరాబాద్ నుంచి గద్వాల వరకు బస్సులో వస్తుంటే ఎక్కడ చూసినా ధాన్యపు రాశులు. పంటలు కోసే హార్వెస్టర్లు, ధాన్యం తరలించే డీసీఎంలు కనిపించాయి. సంతోషం పట్టలేక బస్సు దిగి పొలాల్లోకి వెళ్లి చూశాను. అద్భుతమైన పంటలతో పాలమూరు జిల్లా పాలుగారుతోంది. పాలమూరు ఎత్తిపోతల పథకంపై హరిత ట్రైబున్యల్ వారికి ఉన్న సందేహాలు నివృత్తి చేసి చట్టపరమైన చర్యలు తీసుకుని పూర్తి చేస్తే మహబూబ్‌నగర్ జిల్లా వజ్రపు తునకలా తయారవుతుంది.