కరోనా కాలంలోనూ వనపర్తి జిల్లా మాత్రం రక్త ప్రదాయినిగా మారింది.. రక్తం దొరకక అవస్థలు పడ్డారనే సమస్యే తలెత్తలేదు. మార్చిలో లాక్‌డౌన్ విధించింది మొదలు రెడ్‌క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో నాలుగు నెలల్లో 13 శిబిరాలు నిర్వహించి యుద్ధ ప్రాతిపదికన రక్తాన్ని సేకరించారు.. అవసరమైన వారికి అందించారు..
వనపర్తి జిల్లా ఆసుపత్రిలో రెడ్‌క్రాస్, వైద్యవిధాన పరిషత్తు సంయుక్త ఆధ్వర్యంలో కొనసాగుతున్న రక్తనిధి కేంద్రం ఉంది. రక్తయూనిట్ల అవసరం ఎవరికున్నా ఈ కేంద్రాన్ని ఆశ్రయించాల్సిందే. ఎ పాజిటివ్, బి పాజిటివ్, ఒ పాజిటివ్ నిల్వలు ఎప్పటికప్పుడు కేంద్రానికి సమకూరుతున్నా.. ఏబీ పాజిటివ్, ఏబీ నెగటివ్, ఎ నెగటివ్, బి నెగటివ్, ఒ నెగటివ్ గ్రూప్‌ల నిల్వలు తక్కువగా సమకూరుతుంటాయి. జిల్లాలో ప్రతి నెలా సగటున 200 యూనిట్ల రక్తం అవసరం ఉంటుందనేది అంచనా.
కరోనా ప్రభావం ఉన్నా శిబిరాలు :
మార్చిలో కరోనా వ్యాప్తి ప్రారంభమైంది. సరిగ్గా ఆ సమయంలో రక్తనిల్వల కొరత ఏర్పడింది. రెడ్‌క్రాస్ సంస్థ సభ్యులు వాట్సాప్ ద్వారా రక్తదాతలకు సందేశాలు పంపించి నిల్వలు తగ్గకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కరోనా ప్రభావం ఉన్నా జిల్లా ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్రం ఆధ్వర్యంలో నాలుగు నెలల్లో 13 రక్తదాన శిబిరాలు నిర్వహించి 757 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. రక్తనిధి కేంద్రం నిర్వాహకులు, రెడ్‌క్రాస్ సంస్థ సభ్యులు పక్కా ప్రణాళికతో నిల్వలను సమకూర్చేందుకు అక్టోబర్ వరకు శిబిరాలను నిర్వహించనున్నారు.