Bandi Sanjay letter on fuel rates: పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై తెరాస సహా ఇతర విపక్షాలు ప్రజల్ని తప్పదోవ పట్టించేందుకు యత్నిస్తున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. వనపర్తి జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగిస్తున్న బండి సంజయ్.. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై బహిరంగ లేఖ విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వంపై బురద చల్లడం ద్వారా ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజల్లో అసంతృప్తి నుంచి దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.
తెలంగాణతో సహా 3 రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని బండి సంజయ్ అన్నారు. భాజపా, మిత్రపక్షాలు పాలన సాగిస్తున్న రాష్ట్రాల్లో ఇంధన ధరలు తక్కువగా ఉన్నాయని గుర్తు చేశారు. చమురు ధరల నుంచి ఉపశమనం కలిగించేందుకు ఇప్పటికే రెండు సార్లు కేంద్రం ఎక్సైజ్ సుంకాలని తగ్గించిందని అన్నారు. 18 రాష్ట్ర ప్రభుత్వాలు సైతం వ్యాట్‌ను తగ్గించాయని చెప్పారు. దీనివల్ల ప్రజలపై లీటరుకు రూ. 10 నుంచి 20 భారం తగ్గిందన్నారు.
నయాపైసా తగ్గించని రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటన్న ఆయన.. ప్రజల పట్ల ఏ మాత్రం సానుభూతి ఉన్నా పెట్రో ధరల పెంపు కారణంగా వచ్చే అదనపు ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తగ్గించుకోవాలని సవాల్ విసిరారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక 4 శాతం మేర వ్యాట్‌ను పెంచారని చెప్పారు. తెలంగాణలో ధరలు ఎందుకు ఎక్కువగా ఉన్నాయో మంత్రులు సమాధానం చెప్పగలరా? అని ప్రశ్నించారు. పెట్రోల్ ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావాలని జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేంద్రం ప్రతిపాదన తీసుకొస్తే తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తు చేశారు. ధర్నాలు, ఆందోళనలతో తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్న తెరాస నేతలకు తగిన బుద్ధి చెప్పాలని సూచించారు.