వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కరోనా నియంత్రణలో భాగంగా ప్రతి జిల్లాకు ఒక టాస్క్ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. జిల్లాల ఇంఛార్జి మంత్రుల పర్యవేక్షణలో జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యాధికారి, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్, డ్రగ్ ఇన్స్పెక్టర్తో ఏర్పాటైన టాస్క్ఫోర్స్ కొవిడ్ నియంత్రణకు పని చేస్తుందన్నారు.
ఈ బృందాలు స్థానిక పరిస్థితులను సమీక్షించి ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాయని పేర్కొన్నారు. ఈ విపత్కర పరిస్థితుల నుంచి ప్రజలను కాపాడుకోవడమే లక్ష్యంగా టాస్క్ ఫోర్స్ బృందం పనిచేస్తుందని తెలిపారు. మనోధైర్యానికి మించిన మందు లేదన్నారు. మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నది వ్యాధి తీవ్రతతో కాదని ఆందోళనతోనే జరుగుతున్నాయని చెప్పారు.