తెలంగాణ

telangana

ETV Bharat / state

HRC complaint: ఏడాది ప్రేమ.. సర్పంచ్ జోక్యంతో పెళ్లికి నిరాకరణ!

రెక్కడితోనేగానీ డొక్కాడని నిరుపేద కుటుంబానికి చెందిన యువతికి ప్రేమ పేరుతో వలవేశాడు ఓ యువకుడు. ఏడాది పాటు యువతిని ప్రేమించి... పెళ్లి అనగానే మొహం చాటేశాడు. అయితే యువకుడు ఓ సర్పంచ్ బంధువు కావడమే... తమ ప్రేమకు అడ్డుతగిలిందని బాధితురాలు వాపోయారు. పెద్దల ఒత్తిడితో పెళ్లి చేసుకోలేనని చెప్పినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం ఎక్కడికి వెళ్లినా ఫలితం లేదని.. చివరకు హెచ్చార్సీని ఆశ్రయించినట్లు తెలిపారు.

HRC to complaint, young woman complaint on boy friend
హెచ్చార్సీలో యువతి ఫిర్యాదు, ప్రియుడిపై యువతి ఫిర్యాదు

By

Published : Oct 4, 2021, 3:22 PM IST

Updated : Oct 4, 2021, 4:36 PM IST

ప్రేమ పేరిట సర్పంచ్ బంధువు తనను మోసం చేశాడని ఓ యువతి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​ను(HRC complaint) ఆశ్రయించారు. ఏడాది పాటు ప్రేమించి... పెళ్లి అనగానే మొహం చాటేశాడని వాపోయారు. వనపర్తి జిల్లా మదనాపూర్ మండలానికి చెందిన ఆ యువతి ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. సర్పంచ్ బ్రహ్మమ్మ మరిది వాకిటి విష్ణు కుమారుడు వాకిటి కురుమూర్తి తాను ఏడాది కాలంగా ప్రేమించుకున్నట్లు... పెళ్లిచేసుకోవడానికి తొలుత అతడు అంగీకారం తెలిపినట్లు వెల్లడించారు. ఇప్పుడు పెద్దల ప్రమేయంతో పెళ్లి చేసుకోనని మొహం చాటేశాడని తెలిపారు. స్థానిక పోలీసులు, ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరిగినా లాభం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం హెచ్చార్సీలో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.

ఏడాది నుంచి మేం ప్రేమించుకుంటున్నాం. పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. పెద్దల ప్రమేయంతో ఇప్పుడు చేసుకోనని చెబుతున్నాడు. పెళ్లి చేసుకోవాలని నేను కురుమూర్తి ఇంటికి వెళ్లాను. అక్కడ ఎవరూ లేరు. సర్పంచ్ ఇంటికి వెళ్తే... రాత్రంతా నన్ను గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు. ఈ విషయంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాం... కలెక్టర్, ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. అందుకే కమిషన్​ని ఆశ్రయించాం.

-బాధితురాలు

కురుమూర్తితో మా అమ్మాయి పెళ్లి జరగకపోతే మేం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటాం. ప్రేమ పేరిట మా కూతురిని మోసం చేశాడు. మాకు న్యాయం చేయాలి. అతడితో మా అమ్మాయి వివాహం జరిపించాలి.

-బాధితురాలి తల్లిదండ్రులు

యువకుడిని ప్రేమించిన పాపానికి యువతిని గ్రామ పంచాయతీలో సర్పంచ్ నిర్భంధించడం ఎంతవరకు సమంజసం. యువతికి న్యాయం చేయాలని జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులను కొన్ని రోజులుగా వేడుకుంటున్నారు. అయినా ఫలితం లేదు. రాజకీయ జోక్యంతో న్యాయం చేయకుండా కాలక్షేపం చేస్తున్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. ఇంతటి దారుణానికి పాల్పడిన సర్పంచ్​పై తగు చర్యలు తీసుకోవాలి. ఆ అమ్మాయికి న్యాయం చేయాలి.

-యుగేందర్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

యువతి ఫిర్యాదును స్వీకరించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్... నవంబర్ 15లోపు ఈ సంఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని వనపర్తి జిల్లా ఎస్పీని ఆదేశించింది.

ఇదీ చదవండి:justice sirpurkar commission: సిర్పుర్కర్ కమిషన్ ఎదుట విచారణకు హాజరైన సజ్జనార్

Last Updated : Oct 4, 2021, 4:36 PM IST

ABOUT THE AUTHOR

...view details