అందరి చేతిరాతా ఒకేలా ఉండదు. ఏ భాషలోనైనాసరే అక్షరాల్ని అచ్చం ఒకేలా రాసేవారు ఉండరనే చెప్పొచ్చు. రాతలో ఒక్కొక్కరికీ ఒక్కో శైలి ఉంటుంది. సినిమాలు, పుస్తకాల టైటిళ్లు, పత్రికలు, సంస్థల పేర్లు.. వాటిని రాసే అక్షరశైలిని బట్టే ఆకట్టుకుంటాయి. అలా.. అవే అక్షరాల్ని విభిన్న రూపాల్లో అందంగా, ఆకర్షణీయంగా రాయడమే క్యాలిగ్రఫీ. ఇప్పుడైతే కంప్యూటర్లు, ఫోన్లలో వివిధ ఫాంట్‌లు అందుబాటులో ఉన్నాయి గానీ.. అవి లేకముందు పుస్తకాల్లోని అక్షరాలను అందంగా రాసేందుకు కాలీగ్రఫర్స్ ఉండేవాళ్లు.
గ్రాఫిక్స్, యానిమేషన్స్ వచ్చాక క్రమంగా క్యాలీగ్రాఫర్లకు ఆదరణ తగ్గిపోయింది. ప్రస్తుతం ఫైన్ ఆర్ట్స్‌లో కాలీగ్రఫీ ఓ సబ్జెక్టుగా ఉంది. చిత్రకారులకు ఉన్న గుర్తింపు క్యాలిగ్రాఫర్లకు దక్కక పోవడం.. ఈ కళపై ఆసక్తి చూపించేవారి సంఖ్య తగ్గేందుకు ఓ కారణంగా కనిపిస్తోంది. వివిధ భాషల్లో ఎంతో పేరు సంపాదించుకున్న కాలీగ్రాఫర్స్ ఉన్నా.. తెలుగు అక్షరాలు అందంగా కూర్చే వారిని వేళ్లపై లెక్కపెట్టవచ్చు. వారిలో ఒకరు వనపర్తి జిల్లా ఆత్మకూరు వాసి నవకాంత్ కదిరె.
పాఠశాల స్థాయి నుంచే నవకాంత్‌ది అందమైన చేతిరాత. తోటి విద్యార్ధుల పుస్తకాలపై వారి పేర్లు, వివరాలు ఎంతో అందంగా రాసిచ్చేవాడు. తను రాసే ప్రతిపేరూ దేనికదే భిన్నంగా, సుందరంగానూ ఉండేది. ఆ ప్రత్యేకత వల్లే గుర్తింపు తెచ్చుకున్న ఆ యువకుడు కాలీగ్రఫీపై మరింత దృష్టి పెట్టాడు. ప్రస్తుతం ఆ కళనే వృత్తిగా మలచుకున్నాడు.