అల్లారుముద్దుగా పెంచుకున్న చిన్నారిని బకెట్ రూపంలో మృత్యువు కబళించింది. వనపర్తి జిల్లా గోపాల్‌పేటకు చెందిన బాలరాజు, ఈశ్వరమ్మ దంపతుల ఏకైక కుమారుడు రెండేళ్ల ఈశ్వర్. తన వచ్చీ రాని మాటలతో రోజంతా ఉత్సాహంగా కేరింతలు కొడుతూ ఉండేవాడు. అది చూసి ఓర్వలేని కాలం ఆ చిన్నారిని విగతజీవిగా మార్చింది.
చిన్నారి ప్రాణం తీసిన బకెట్.. తల్లడిల్లిన మాతృ హృదయం - వనపర్తిలో చిన్నారి బకెట్లో పడి చనిపోయాడు
ఇంటిముందు బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకుంటున్న చిన్నారి అకస్మాత్తుగా కనిపించ లేదు. ఎక్కడికెళ్లాడు నా చిన్ని తండ్రి అనుకుంటూ వెతకని చోటంటూ లేదు. కానీ ఊహించని రీతిలో బకెట్లో శవమై కనిపించాడు. పాపం వారికేం తెలుసు ఓ చిన్న బకెట్ తన చిన్నారి ప్రాణం తీస్తుందని. బకెట్లో విగతజీవిగా మారిన తన చిన్నారి చూసి ఆ మాతృమూర్తి నిశ్చేస్ఠురాలైంది. గుండెలకు హత్తుకుని బోరున విలపించింది. ఈ హృదయ విదారక ఘటన వనపర్తి జిల్లా గోపాల్‌పేటలో చోటుచేసుకుంది.
తల్లిదండ్రులు పనిలో ఉండగా మంగళవారం ఇంటి ముందు సరదాగా ఆడుకుంటూ ఉన్న చిన్నారి వారు బయటకు వచ్చి చూసే సరికి కనిపించలేదు. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు బాలుడి ఆచూకీ కోసం ఎంత వెతికినా కనిపించ లేదు. ఇంటి పక్కల పరిసర ప్రాంతాల్లో వెతుకుతుండగా అమ్మా మా కొడుకును చూశారా అంటూ కనిపించిన ప్రతి వ్యక్తిని అడిగారు. కానీ చివరకు ఊహించని రీతిగా ఇంటి పక్కనే ఉన్న బకెట్లో నీట మునిగి ఈశ్వర్ విగతజీవిగా కనిపించాడు. అది చూసిన వారు నిశ్చేస్ఠులయ్యారు. తన కొడుకును బకెట్లో నుంచి తీసి గుండెలకు హత్తుకుని ఈశ్వర్ లే నాన్నా అంటూ ఆ తల్లి విలపించిన తీరు చుట్టుపక్కల జనాలకు కంటనీరు పెట్టించింది.
ఇవీ చూడండి:కేంద్ర విద్యుత్తు చట్టంపై కేసీఆర్ గుస్సా..