వికారాబాద్‌లో ఆగస్టు 21న హత్యకు గురైన గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. హతురాలి చిరునామా దొరికినందున... కేసు చిక్కుముడి వీడిపోయింది. దశాబ్దంన్నర క్రితం మర్పల్లి మండలానికి చెందిన యువతికి సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలానికి చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. చాన్నాళ్లు వీరి కాపురం సవ్యంగానే సాగింది. వీరికి 13 ఏళ్ల కూతురు, 10 ఏళ్ల కొడుకు ఉన్నారు.
రెండేళ్ల క్రితం ఆమెకు మర్పల్లి మండలం మల్లికార్జునగిరికి చెందిన పద్మారావుతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. అప్పటికే పద్మారావుకు పెళ్లై భార్య, ఓ బాబు, పాప ఉన్నారు. ఆమె పిల్లలతో సహా పద్మారావు పంచన చేరింది. కొన్ని రోజులు సదాశివపేటలో ఓ గదిని అద్దెకు తీసుకొని వారిని అక్కడే ఉంచాడు. మూడు మాసాల క్రితం మకాం మార్చి వికారాబాద్ పట్టణంలోని ఎన్నెపల్లిలోని ఓ అద్దె గదిలో ఉంచాడు. ఈ క్రమంలో ఆమె ఇతరులతో చనువుగా ఉండటాన్ని పద్మారావు గుర్తించాడు.