వికారాబాద్ పట్టణంలోని ఆలంపల్లిలో నివసించే నిరుపేద కమల కుటుంబం కొత్తగా ఇల్లు కట్టుకుంది. గత నెల 23న గృహప్రవేశం జరిగింది. పట్టుమని 10రోజులు కూడా కాకముందే... ఈ ఇంటికి మున్సిపల్ సిబ్బంది వచ్చారు. మీ ఇంటిపై ఫిర్యాదు అందిందని ఇంట్లో పెద్దవారు లేని సమయంలో... ఇంటి దర్వాజ పగలగొట్టారు.
విచారణ లేదు... నోటీసులు లేవు..
పక్కింటి వ్యక్తి శ్రీకాంత్.. కమల ఇంటి వల్ల తన ఇంటికి వీధిపోటు వస్తుందని మున్సిపల్ ఆఫీసులో ఫిర్యాదు చేశాడు. ఇంకేముంది... ఏ ఫిర్యాదు చేసినా నిమ్మకు నీరెత్తినట్లు ఉంటే సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండానే.. గునపంతో దర్వాజ, తలుపును ధ్వంసం చేశారు. ప్రభుత్వ అధికారులు సైతం మూఢనమ్మకాలను ప్రోత్సహించడం విడ్డూరంగా ఉందని బాధితురాలు కమల వాపోయింది.
పట్టించుకోవడం లేదు
దీనిపై మున్సిపల్, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితురాలు ఆరోపించింది. శ్రీకాంత్ పోలీసు కానిస్టేబుల్ అయినందున తమకు న్యాయం చేయడానికి అధికారులు సంకోచిస్తున్నారని ఆరోపించారు. అప్పులు తీసుకొచ్చి గూడుకట్టుకుంటే ఇలా పగలగొట్టడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నారు.
కష్టపడి ఇల్లు కట్టుకున్నాం మేము. వేరే ఇంటికి వీధిపోటు వచ్చిందని... మున్సిపల్ సిబ్బంది కూల్చేశారు. పక్కింటి వ్యక్తి శ్రీకాంత్ మున్సిపాలిటీకి పోయి కంప్లైంట్ ఇచ్చారు. వాళ్లకు ఒకటే ఫోన్లు చేశారంటా. మేం చేనుకు పోయినం. ఆ సమయంలో మా బాబు ఉన్నాడు. అప్పుడు వచ్చి కూల్చేశారు. తెల్లందాకా... పొద్దుందాకా కష్టపడి మేం ఇల్లు కట్టుకున్నాం. అప్పులైనయ్. మేమెట్లా తీర్పుకోవాలి? మున్సిపాలిటీ, పోలీస్ స్టేషన్లలో రిపోర్టు ఇచ్చినం. ఎవరూ పట్టించుకోవడం లేదు.
-కమల, బాధితురాలు
తలుపు ధ్వంసం చేశారని బాధితురాలి ఆవేదన ఇదీ చదవండి:Corona Cases in Schools: పాఠశాలలపై కరోనా పంజా.. రెండు చోట్ల ఐదుగురికి పాజిటివ్