తెలంగాణ

telangana

ETV Bharat / state

అకాల వర్షం... అన్నదాతకు నష్టం

వికారాబాద్​ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులకు చేతికొచ్చిన పంట నేల వాలింది. చాలా ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. ఇండ్లపై ఉన్న పైకప్పు రేకులు ఎగిరిపోయాయి.

vikarabad district rain news
vikarabad district rain news

By

Published : May 8, 2020, 9:31 AM IST

వికారాబాద్​ జిల్లాలో కురిసిన అకాల వర్షం... అన్నదాతలకు భారీ నష్టం చేకూర్చింది. చేతికొచ్చిన వరి పంట నేల వాలింది. మామిడి కాయలు రాలిపోయాయి. బొప్పాయి, కూరగాయల తోటలు దెబ్బతిని రైతులు నష్టపోయారు. చాలా ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. ఇండ్లపై ఉన్న పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

వికారాబాద్‌ పట్టణం మద్గుల్‌ చిట్టెంపల్లి వాగు ఉద్ధృతంగా ప్రవహించింది. నవాబుపేట మండల కేంద్రంతో పాటు, యావపూర్‌, చిట్టిగిద్ద, ఎత్‌రాజ్‌పల్లి, మీనెపల్లికలాన్‌, ఆర్కతల, చించల్‌పేట, మాదిరెడ్డిపల్లి, ఎల్లకొండ, పులుమామిడి, దాతపూర్‌, ఎక్‌మామిడి గ్రామాల్లో ఖాళీ పొలాల్లోకి నీరు చేరింది.

యావపూర్‌లో ఇంటిపైకప్పు రేకులు ఎగిరిపోయి దూరంగా పడ్డాయి. ధారూరు మండలం మోమిన్‌కలాన్‌లో వరి పంట నేలకొరిగింది. చింతకుంటలో స్తంభం విరిగిపడింది. కుక్కిందలో విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. ఎవరూ లేకపోవడం వల్ల ప్రమాదం తప్పింది.

మోమిన్‌పేట ఎస్‌బీఐ బ్యాంకు వద్ద వేసిన టెంట్‌ కుప్పకూలడంతో ప్రజలు పరుగులు తీశారు. దేవరంపల్లి వాగు వద్ద తాత్కాలికంగా నిర్మించిన మట్టి రోడ్డు కొట్టుకుపోవడంతో రాకపోకలు ఆగిపోయాయి.

అప్రమత్తమైన కర్షకులు...

తాండూరు మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా రైతులు జాగ్రత్తపడ్డారు. బస్తాలపై తాడిపత్రులను కప్పివేశారు. ఆరబెట్టిన ధాన్యాన్ని అప్పటికప్పుడు బస్తాల్లో నింపి తరలించారు. బెల్కటూరు, మల్‌రెడ్డిపల్లి, వీర్‌శెట్టిపల్లిలో ధాన్యం బస్తాలు తడవకుండా ప్రభుత్వ పాఠశాలలోని వరండా, గదుల్లోకి తరలించి నిల్వ చేశారు.

వర్షం కారణంగా గ్రామాల్లో మధ్యాహ్నం 2.30 గంటలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. సాయంత్రం 6గంటలు దాటినా పునరుద్ధరించ లేదు. యాలాల, కొడంగల్‌, బొంరాస్‌పేట మండలాల్లోని పలు గ్రామాల్లో ఈదురు గాలులకు మామిడి కాయలు రాలి పోయాయి. పరిగి మండలంలో తాత్కాలికంగా వేసుకున్న పశువుల పాకలు గాలికి ధ్వంసమైయ్యాయి. పూడూరు మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో వడగళ్లు పడ్డాయి. కొడంగల్‌ నియోజకవర్గంలోని మెట్లకుంట, కొత్తూరు గ్రామాల్లో పంటలకు నష్టం వాటిల్లింది.

ABOUT THE AUTHOR

...view details