పంట పండించడం ఒకెత్తు.. దాన్ని ఇంటికి తీసుకెళ్లడం మరో ఎత్తు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం చిగురాల్‌పల్లి గ్రామ రైతులు పొలాలకు వెళ్లాలంటే మూడు వాగులను దాటాలి. మూడు నెలల క్రితం నడక దారి కోసం వాగులపై వెదురు, విరిగిన విద్యుత్తు స్తంభాలతో రైతులే తాత్కాలిక వంతెన నిర్మించుకున్నారు. ఈ సారి సుమారు 500 ఎకరాల్లో పంటలను సాగు చేశారు. మొక్కజొన్న పంట కాలం ముగియడంతో కోతలు చేపట్టారు. పంటను వెదురు వంతెనపై నుంచి తరలించాలంటే కూలీలు అవసరం. వారి ఖర్చు భరించలేని రైతులు నానా ప్రయాసలు పడి ఎడ్లబండ్ల ద్వారా తరలిస్తున్నారు. ఎడ్లు తల వరకు నీట మునిగినా.. బండ్లను ఈడ్చుకెళ్తూ పంటను ఒడ్డుకు చేర్చుతున్నాయి. అక్కడి నుంచి రైతులు ఇళ్లకు, మార్కెట్కు తరలిస్తున్నారు. ప్రజాప్రతినిధులు స్పందించి వాగులపై వంతెనలను నిర్మించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
రైతన్న కష్టం.. బసవన్నపై భారం - తెలంగాణ తాజా వార్తలు
వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో కనీస మౌలిక వసతులు లేకపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. సరైన రహదారి మార్గం లేక రైతులు తాము పండించిన పంటలను తరలించేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
vikarabad news