తెలంగాణ

telangana

ETV Bharat / state

నిరుపయోగంగా చెత్తదిబ్బలు.. నెలలు గడిచినా వినియోగంలోకి రాని వైనం - Unused trash cans in vikarabad district

వికారాబాద్ జిల్లాలో ఉపాధిహామి పథకం కింద చెత్త దిబ్బల ఏర్పాటుకు ఖరారు చేశారు. ఒక్కో నిర్మాణానికి రూ.2.5లక్షల చొప్పున నిధులు కేటాయించారు. వీటితో జిల్లాలో 564 పంచాయతీల్లో అధికారులు నిర్మాణాలు చేపట్టారు. ఇవి పూర్తై నెలలు గడిచినా వినియోగంలోకి తేవడం లేదు.

Unused trash cans in vikarabad district
Unused trash cans in vikarabad district

By

Published : Aug 21, 2020, 7:56 AM IST

జాతీయ హరిత ట్రిబ్యునల్‌ సూచనల మేరకు వికారాబాద్ జిల్లాలో స్వచ్ఛతకు బాటలు వేసేందుకు సంకల్పించారు. గ్రామాలను పరిశుభ్రంగా మార్చాలని చెత్తదిబ్బల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలను పారవేయకుండా, ఇంటింటి నుంచి చెత్తను సేకరిస్తున్నారు. ఒక చోటకు చేర్చి తడిగా ఉన్నదాన్ని ఎరువుగా మార్చడం, పొడిగా ఉంటే వేలంపాట ద్వారా విక్రయించి పంచాయతీలకు ఆదాయం సమకూర్చాలన్నది లక్ష్యం.

ఈ మేరకు ఉపాధిహామి పథకం కింద చెత్త దిబ్బల నిర్మాణాలకు ఖరారు చేశారు. ఒక్కో నిర్మాణానికి రూ.2.5లక్షల చొప్పున నిధులను కేటాయించారు. వీటితో జిల్లాలో 564 పంచాయతీల్లో అధికారులు నిర్మాణాలు చేపట్టారు. 68 పంచాయతీల్లో నేల చదును పనులు కొనసాగుతున్నాయి. 92 పంచాయతీల్లో పునాది దశలో ఉండగా, 187 నిర్మాణాలు వివిధ దశల్లో సాగుతున్నాయి. ఇప్పటివరకు అత్యధికంగా బొంరాస్‌పేట మండలంలో 25, కుల్కచర్ల మండలంలో 22 పంచాయతీల్లో వీటిని నిర్మించారు. పదహారు మండలాల్లోని 160 పంచాయతీల్లో కేంద్రాలు పూర్తయ్యాయి. ఇవి పూర్తై నెలలు గడిచినా వినియోగంలోకి తేవడం లేదు.

తాండూరులో రూర్బన్‌ పథకం కింద

తాండూరు మండలంలోని 33 పంచాయతీల్లో నిర్మించాలని ఖరారు చేశారు. వీటిలో పదింటిని రూర్బన్‌ పథకం కింద చేపట్టారు. ఒక్కో నిర్మాణానికి రూ.8 లక్షల చొప్పున నిధులు మంజూరు చేశారు. జిన్‌గుర్తి, కరణ్‌కోట, అల్లాపూర్‌లో రూ.24 లక్షలతో పూర్తయ్యాయి. జిన్‌గుర్తిలో నిర్మించి ఏడాది గడుస్తుండగా ఇప్పటివరకు ప్రారంభోత్సవానికి నోచడంలేదు. అల్లాపూర్‌లో ఆరునెలలుగా, కరణ్‌కోటలో నాలుగు నెలలుగా ఇదే పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా పదులసంఖ్య పంచాయతీల్లో నిర్మించినప్పటికి నిరుపయోగంగా ఉంచారు.

మున్సిపాలిటీల మాదిరి..

చెత్తదిబ్బల నిర్మాణంతో పట్టణాల తరహాలో గ్రామాల్లోనూ పారిశుద్ధ్య కార్మికులు ట్రాక్టర్‌లు, ఆటోల్లో రోజువిడిచి రోజు ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరిస్తున్నారు. అందుకు పంచాయతీ ద్వారా ఇంటింటికి ఉచితంగా చెత్త బుట్టలను పంపిణీ చేశారు. వీధులు, రహదారుల మీద పారవేయకుండా బుట్టల్లో నిల్వ చేసి పారిశుద్ధ్య కార్మికులకు అప్పగించేలా ప్రజలకు అవగాహన కల్పించారు. మొదట్లో బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసిన వారికి రూ.500 చొప్పున పంచాయతీ కార్యదర్శులు జరిమానా సైతం విధించారు. ఈ పరిస్థితితో చాలావరకు వీధులు స్వచ్ఛంగా మారాయి. చెత్త రహిత గ్రామాలకు అడుగులు పడ్డాయి.

గ్రామ శివార్లలో కుప్పలుగా..

ఇంటింటి నుంచి సేకరించిన చెత్తను చెత్తదిబ్బల్లోకి తరలించాల్సి ఉండగా ఊరి చివర కుప్పలుగా పారబోస్తున్నారు. దీనివల్ల ఎరువుగా తయారు చేసి రైతులకు విక్రయించే లక్ష్యం నీరుగారుతోంది. పొడి చెత్తను నెలనెలా వేలంపాట ద్వారా విక్రయించాల్సి ఉండగా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు చేసిన నిర్మింపజేసిన చెత్తదిబ్బల ఉద్దేశం నెరవేరకుండాపోతోంది. నెలలతరబడి నిరుపయోగంగా ఉంచడంతో ప్రజాధనం వృథా అయ్యే ఆస్కారమేర్పడింది. ఉన్నతాధికారులు దృష్టిసారించి వెంటనే వినియోగంలోకి తీసుకురావాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు.

చెత్తదిబ్బ నిర్వహణపై శిక్షణ

పంచాయతీకి ఒకటి చొప్పున కంపోస్టు షెడ్ల నిర్మాణాలు 70 శాతం పూర్తయ్యాయి. మిగిలినవి నెలరోజుల్లోగా పూర్తవుతాయి. తడి చెత్తను ఎరువుగా మార్చడం, పొడి చెత్తను వేలంపాట ద్వారా విక్రయించడం వంటి నిర్వహణ బాధ్యతలను ఐకెపీ సిబ్బంది, స్థానిక డ్వాక్రా సంఘాల ప్రతినిధులకు అప్పగించాం. వారికి శిక్షణ ఇచ్చాం. త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తాం.

- నరోత్తంరెడ్డి, ఏపీఓ, తాండూరు

ఇదీ చదవండి-రికార్డు స్థాయిలో కరోనా టెస్టులు- రోజుకు 10 లక్షల దిశగా

ABOUT THE AUTHOR

...view details