Kavach system Trial run by Ashwini Vaishnav: స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 'కవచ్' భారతీయ రైల్వే చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా రెండు రైళ్లు వచ్చినా.... ప్రమాదం నివారించేలా కవచ్ వ్యవస్థను రూపొందించారు. వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట్ మండలం లింగంపల్లి- వికారాబాద్ సెక్షన్‌లోని గుల్లగూడ- చిటిగిడ్డ రైల్వే స్టేషన్ల మధ్య కవచ్ పనితీరును అశ్వినీ వైష్ణవ్ పరిశీలించారు. రైల్వే మంత్రి స్వయంగా ఎదురెదురుగా వచ్చే రైళ్లలో ఒకదాంట్లో కూర్చొని కవచ్ పనితీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. దిల్లీ-ముంబయి, దిల్లీ-హౌరా వంటి రద్దీ మార్గాల్లో 2వేల కిలోమీటర్ల మేర కవచ్ వ్యవస్థను విస్తరిస్తామని రైల్వేమంత్రి వెల్లడించారు. ఆత్మనిర్భర్ భారత్‌లో ఇదొక మైలురాయని పేర్కొన్నారు. ఎదురెదురుగా రైళ్లు వచ్చిన సమయంలో ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఏర్పాటు చేసిన లోకో మోటివ్ ఇంటర్ లాకింగ్ సిస్టంను ఆయన పరిశీలించారు.
కవచ్ వ్యవస్థతో ఆటోమెటిగ్గా బ్రేకులు పడతాయి: కేంద్రమంత్రి 4జీ స్పెక్ట్రమ్
కవచ్.. అధిక భధ్రతతో కూడిన ఇంటిగ్రెటీ లెవల్- 4 ప్రమాణాలకు అనుగుణంగా.. అత్యాధునిక ఎలక్ట్రానిక్ వ్యవస్థ కలిగి ఉందని రైల్వేశాఖ మంత్రి వైష్ణవ్ స్పష్టం చేశారు. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా భారతీయ రైల్వే చేపట్టిన కవచ్ ఒక ముందడుగు అని వెల్లడించారు. భారతీయ రైల్వేకు 4జీ స్పెక్ట్రమ్ కేటాయించినట్లు.. దీంతో రైలు రవాణాలో విశ్వసనీయత మరింత పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
పావు వంతు ఖర్చు
ఇదే తరహా వ్యవస్థలకు విదేశాల్లో రూ. 2కోట్ల వరకూ ఖర్చయితే... దేశీయ సాంకేతికతో రూ. 50లక్షల్లోనే అభివృద్ధి చేయగలిగామని కేంద్ర మంత్రి అన్నారు. ప్రస్తుతం కవచ్ వ్యవస్థ దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని వాడి -వికారాబాద్, సనత్‌నగర్- వికారాబాద్, బీదర్ సెక్షన్లలో 25 స్టేషన్లను కవర్ చేస్తూ 264 కిమీల మేర అమలుచేస్తున్నారు. ట్రయల్ రన్ అనంతరం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా దేశీయ పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన మేధ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని అశ్వినీ వైష్ణవ్ ప్రారంభించారు.
ఆటోమేటిక్‌గా బ్రేకులు
"ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చినా కవచ్ టెక్నాలజీ ద్వారా అత్యంత సమీపానికి వచ్చి ఆగిపోతాయి. ఈ వ్యవస్థతో రైళ్లకు ఆటోమేటిక్‌గా బ్రేకులు పడతాయి. పట్టాలు బాగా లేనప్పుడు, ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు, ఎదురెదురుగా వచ్చినప్పుడు గుర్తించి ఇది ఆపుతుంది. వంతెనలు, మలుపులు ఉన్నచోట పరిమితికి మించిన వేగంతో రైలు నడుపుతుంటే కవచ్‌లోని రక్షణ వ్యవస్థ స్పందిస్తుంది." -అశ్వినీ వైష్ణవ్, కేంద్ర రైల్వే శాఖ మంత్రి
అంతకుముందుగా శంషాబాద్ విమానాశ్రయంలో ఎంపీలు రంజిత్ రెడ్డి, ధర్మపురి అర్వింద్.. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కి ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి ఉందానగర్ రైల్వే స్టేషన్‌కు ఆయన చేరుకున్నారు. పార్టీ నేతలు ఆయనకు స్వాగతం పలికారు. వికారాబాద్ రైల్వే సమస్యలపై ఎమ్మెల్యే ఆనంద్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యలు.. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణయ్కు వినతి పత్రాలు సమర్పించారు.
ఇదీ చదవండి:ఒకే ట్రాక్‌పై.. ఎదురెదురుగా రైళ్లు.. వాటిల్లో రైల్వే మంత్రి, రైల్వేబోర్డు ఛైర్మన్