శిథిలావస్థలో కల్వర్టు గోడ
గౌతాపూర్‌లో మల్లన్న చెరువు నిండితే కాల్వల ద్వారా అంతర్ రాష్ట్ర రహదారిలో ఉన్న కల్వర్టుల నుంచి వరద పారేది. క్రమంగా కల్వర్టు ఒకవైపు పూడిపోయింది. రక్షణ గోడ ఆనవాళ్లు కోల్పోయింది. పక్కనే ఉన్న పరిశ్రమ నిర్వహకులు నాపరాయి నిల్వ ఉంచడంతో కల్వర్టు కనుమరుగైంది
తాండూరు పట్టణ శివారులో వరద అంతర్ రాష్ట్ర రహదారిపైకి చేరకుండా కల్వర్టు నిర్మించారు. ఇక్కడ భూముల ధరలకు రెక్కలు రావడంతో ఒకవైపు కాల్వను పూర్తిగా మూసివేసేలా నిర్మాణాలు వెలిశాయి. రక్షణ గోడలు శిథిలమయ్యాయి.
రహదారిపై వరద..:
కాల్వలు, కల్వర్టులను ఎక్కడికక్కడ ఆక్రమణలకు గురికావడంతో గత నెలలో కురిసిన వర్షాలకు వరదనీరు ఒక్కసారిగా అంతర్ రాష్ట్ర రహదారిపై పోటెత్తింది. రోజుల తరబడి మోకాళ్ల లోతు నీరు ప్రవహించడంతో తారు తుడిచిపెట్టుకుపోయింది. నీరు పారిన వందల మీటర్ల దూరం గుంతలు పడి అధ్వానంగా మారింది. రహదారి వారగా లోతట్టునున్న నాపరాయి పరిశ్రమలు, కార్మికులల్లోకి నీరు చేరడంతో ఇబ్బందులుపడ్డారు. గౌతాపూర్ సమీపంలోని విద్యుత్ ఉపకేంద్రంలోకి సైతం వరద చేరింది. తొమ్మిది గ్రామాల్లో రెండు రోజులపాటు త్రీఫేజ్ సరఫరా లేకుండాపోయింది. ఆయా గ్రామాల పరిధిలోని 300లకుపైగా నాపరాయి పరిశ్రమల్లో కార్యకలాపాలు నిలిచిపోయి యాజమానులు, కార్మికుల ఆదాయానికి గండిపడింది. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఆక్రమణలు తొలగించి కల్వర్టులు, కాలువలను పునరుద్ధరించాలని పట్టణవాసులు కోరుతున్నారు.
ఇదీ పరిస్థితి..
- పట్టణం నుంచి అల్లాపూర్ వరకు ఐదు కిలోమీటర్ల మేర కల్వర్టుల వద్ద కాల్వలు కబ్జాలకు గురయ్యాయి.
- మహబూబ్‌నగర్ మార్గంలో చిలుక వాగు కాల్వలు కబ్జాకు గురైంది. ఈ ప్రాంతంలో భారీ భవంతులు వెలిశాయి.
- చించోళి మార్గంలో గౌతాపూర్ వరకు మూడు చోట్ల కల్వర్టులు, ఒక చోట వంతెన ఉండగా, కేవలం వంతెన కింద కాల్వ నుంచి మాత్రమే ప్రస్తుతం వరద పారుతోంది. మిగిలిన మూడు చోట్ల కాల్వలు ఆక్రమణలకు గురయ్యాయి. వంతెన వద్ద ఎడమ వైపు గోడలను ఆనుకొని నిర్మాణాలు చేపట్టారు. కల్వర్టు గోడలు శిథిలావస్థకు చేరి కనుమరుగవుతున్నాయి.
ఆక్రమణల్ని తొలగిస్తాం
కాల్వలు, కల్వర్టులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాల్ని తొలగిస్తాం. అంతర్ రాష్ట్ర రహదారికి ఇరువైపులా కల్వర్టుల వారగా కాల్వలను పునరుద్ధరించి వరద పారేలా చేయిస్తాం. త్వరలో రెవెన్యూతో పాటు నీటి పారుదల శాఖ, రహదారులు భవనాల శాఖ అధికారులతో సంయుక్తంగా కార్యాచరణ అమలు చేస్తాం. - అశోక్‌కుమార్, ఆర్డీఓ, తాండూరు.