వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలోని చాపలగూడెంలో సుమారు 400 మంది జనాభా ఉంది. అందులో కొందరు వ్యవసాయంపై ఆధారపడితే మరికొంత మంది కులవృత్తులను నమ్ముకొని జీవిస్తున్నారు. కాలక్రమేణా కులవృత్తుల ఆదరణ తగ్గడం వల్ల కుమ్మరి, కమ్మరి, వడ్రంగి తదితర కులాలకు చెందిన యువతీ యువకులు బతుకుదెరువు కోసం భాగ్యనగరం బాటపట్టారు. దొరికిన పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. అయితే అదే గ్రామానికి చెందిన కుమ్మరి స్వామి అనే యువకుడు లోయర్ ట్యాంక్ బండ్ వద్ద గణపతి విగ్రహాల తయారీ కేంద్రంలో చేరాడు. కొద్దిరోజుల్లోనే ఆ పని నేర్చుకొని పీవోపీ విగ్రహాల వల్ల పర్యావరణానికి జరుగుతున్న నష్టాన్ని గ్రహించాడు. దేవుడితో ఆ పాపం చేయడమెందుకని గ్రహించి గ్రామంలో మట్టి విగ్రహాల తయారీకి శ్రీకారం చుట్టాడు. మొదట కుటుంబసభ్యులతోనే మట్టి గణపతులను తయారు చేసేవాడు.
బూజ్జాయిలు తయారు చేస్తారు
తొలుత నష్టాలను చవిచూసిన స్వామి ఎక్కడా వెనక్కి తగ్గలేదు. తను నేర్చుకున్న విద్యను గ్రామస్థులందరికీ నేర్పి ఉపాధి అవకాశాలు చూపించాడు. తమ జిల్లా పరిధిలో ఎక్కడ కూడా పీవోపీ విగ్రహాలు పెట్టకుండా పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాడు. ఆ దిశగా మట్టి విగ్రహాల తయారీలో నేర్పు సాధించిన చాపలగూడెం ప్రజలు 12 ఏళ్లుగా వాటినే తయారు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. పాఠశాలల వేళలు ముగిశాక, వారాంతాలు, సెలవు రోజుల్లో తమ చిట్టి చేతులతో మట్టి గణపయ్యలను తయారు చేస్తూ పర్యావరణ కోసం గట్టిమేలు చేస్తున్నారు బుజ్జాయిలు. కేవలం కుమ్మరులే కాకుండా ఇతర కులస్థులు కూడా అడుగు నుంచి 8 అడుగుల వరకు మట్టి గణపతులను తయారు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు.
నాణ్యమైన విగ్రహాల తయారీనే లక్ష్యం