కేంద్ర ప్రభుత్వం స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ (ఎస్‌పీసీ) పథకాని మొదటగా కేరళలో ప్రారంభించారు. ఆ రాష్ట్రంలో సత్ఫలితాలు రావడం వల్ల తెలంగాణలో గతేడాది నుంచి అమలు చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలతోపాటు ఇతర అత్యవసర పరిస్థితుల్లో పోలీసులకు తోడుగా నిలిచేలా విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే విద్యాసంవత్సరానికి వికారాబాద్ జిల్లాలో ఉన్నత పాఠశాలలను ఎంపిక చేశారు.
జిల్లాలో 196 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రతి మండలం నుంచి ఒక ఉన్నత పాఠశాలను గుర్తించి, 8,9వ తరగతి విద్యార్థులను ఎస్‌పీసీకి ఎంపిక చేయనున్నారు. శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యవంతులైన వారికే అవకాశం ఉంటుంది. ఒక్కో పాఠశాల (కోఎడ్యుకేషన్) నుంచి 44 మంది విద్యార్థిని, విద్యార్థులుంటారు. కస్తూర్బా పాఠశాలలో 22 మందికి ఈ క్యాడెట్ శిక్షణలో అవకాశం కల్పిస్తారు. ఎంపిక అనంతరం దుస్తులు, బూట్లు, టై, మహనీయుల జీవిత చరిత్రలు, ఇతర పుస్తకాలను సమకూర్చుతారు.
వారంలో రెండు రోజుల పాటు పోలీసు సిబ్బంది ఆయా పాఠశాలలకు వచ్చి వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తారు. గతేడాది 17 పాఠశాలల్లో 748 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ఇందుకోసం రూ.7.5 లక్షల వరకు ఖర్చు చేశామని పోలీసు శాఖ తెలిపింది. ప్రస్తుతం వచ్చే ఏడాదికి 836 మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు రూ.8.5 లక్షల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.
ఎంపిక చేసిన పాఠశాలలో 44 మంది విద్యార్థులుంటే రూ.50 వేలు, 22 మంది ఉంటే రూ.25 వేలు మంజూరు చేస్తారు. ఈ నిధులను కేంద్ర ప్రభుత్వం పోలీసు శాఖకు అందిస్తుంది. పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఎస్పీ నిధులను పంపిణీ చేస్తారు. విద్యాసంవత్సరం ప్రారంభమైన అనంతరం ఆగస్టు- సెప్టెంబరులో శిక్షణ ప్రారంభమయి, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ముగుస్తుంది. ఇందులో ఎంపికైన విద్యార్థులకు ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, స్కౌట్స్ క్యాడెట్స్‌కు అందించినట్లే ఎస్‌పీసీ విద్యార్థులకు ధ్రువీకరణపత్రాలు ఇస్తారు. వీరిని అత్యవసర సమయంలో సేవలకు వినియోగించుకునే అవకాశం ఉంది. విద్యార్థులను అన్ని రకాలుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఎస్పీ నారాయణ తెలిపారు.