తెలంగాణ

telangana

ETV Bharat / state

'చెప్పుకుంటే పరువు పోయే.. చెప్పకుంటే ప్రాణం పోయే'.. సర్పంచ్​ల ఆవేదన - Telangana Sarpanches News

Sarpanches On Pending Bills: రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్​లు ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించడం లేదని వాపోయారు. పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Sarpanches
Sarpanches

By

Published : Jun 1, 2022, 7:53 AM IST

Sarpanches On Pending Bills: పంచాయతీలకు నిధులు.. గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్‌ బిల్లులను వెంటనే విడుదల చేయాలంటూ మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నిరసనలు జరిగాయి. పల్లె ప్రగతి సమావేశాలను బహిష్కరించారు.

*ఆదిలాబాద్‌ జిల్లాలోని తాంసి మండల పరిషత్‌ కార్యాలయంలో జరిగిన అయిదో విడత పల్లెప్రగతి మండలస్థాయి అవగాహన సదస్సును తెరాస సహా కాంగ్రెస్‌ సర్పంచులు బహిష్కరించారు. పనులకు అప్పులు చేసి నానా ఇబ్బందులు పడుతున్నామని సర్పంచుల సంఘం అధ్యక్షుడు సదానందం ఆవేదన వ్యక్తం చేశారు.

*మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలంలో ఆర్డీవో శ్యామలదేవి ఆధ్వర్యంలో నిర్వహించిన పల్లె ప్రగతి పనుల సమావేశాన్ని మండలంలోని అన్ని పంచాయతీల సర్పంచులు బహిష్కరించారు. తమకు జనవరి నుంచి ఇప్పటి వరకు జరిగిన పనులకు బిల్లులు రాలేదని వారు నిరసన తెలిపారు.

*ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో జరిగిన పల్లె ప్రగతి సమావేశానికి 28 మంది సర్పంచులలో 15 మంది గైర్హాజరయ్యారు. ఎంపీటీసీ సభ్యులు అయిదుగురే హాజరయ్యారు.

*మెదక్‌ జిల్లా తూప్రాన్‌ ఎంపీపీ గడ్డి స్వప్న అధ్యక్షతన మంగళవారం పల్లెప్రగతి పనులపై సమావేశం నిర్వహించారు. మండలంలో 14 పంచాయతీలు ఉండగా ఆరుగురు సర్పంచులు, ఆరుగురు సర్పంచుల బంధువులు, తెరాస నాయకులు హాజరయ్యారు. సమావేశం ఆరంభంలోనే వారు ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ.. నిధులు మంజూరు చేసే వరకు ఎలాంటి పనులు చేయమని చెబుతూ సమావేశాన్ని బహిష్కరించారు. ఇందులో తూప్రాన్‌ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు భగవాన్‌రెడ్డి, సర్పంచులు పోచయ్య, సత్యనారాయణ, పాండు, ఎల్లం, నర్సమ్మ తదితరులున్నారు.

ఎంపీ, ఎమ్మెల్యేల ముందే సర్పంచి కంటతడి:వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ ‘మీతో..నేను’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నియోజకవర్గంలోని కరీంపూర్‌లో పర్యటించారు. అనంతరం గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. ఎంపీ రంజిత్‌రెడ్డి కూడా హాజరయ్యారు. సమావేశం జరుగుతుండగానే కోట్‌పల్లి మండలం బీరోల్‌ గ్రామ సర్పంచి సూర్యకళ భోరున విలపించారు. ‘గ్రామంలో రూ.25 లక్షలతో సీసీ రోడ్లు, శ్మశానవాటిక, గుంతల పూడ్చివేత వంటి అభివృద్ధి పనులు చేశాం.. సంవత్సరం గడుస్తున్నా బిల్లులు రాలేదు. అధ్వానంగా ఉన్న మరికొన్ని రోడ్లను బాగు చేయాలని గ్రామస్థులు ఒత్తిడి చేస్తున్నారు. చేసిన పనులకే బిల్లులు రాక నష్టపోతుంటే...కొత్త పనులు ఎలా ప్రారంభించగలం’ అంటూ విలపించారు. దీంతో ఎంపీ, ఎమ్మెల్యే ఆమెను సముదాయిస్తూ.. త్వరలోనే బిల్లులు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

చెప్పుకుంటే పరువు పాయే: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల పరిషత్​లో జరిగిన పల్లెప్రగతి సన్నాహాక సమావేశాన్ని పలు గ్రామాల సర్పంచులు బహిష్కరించారు. గ్రామాలకు సేవ చేయాలనే ఉద్దేశంతో సర్పంచ్​లుగా గెలిచి మూడు సంవత్సరాలు గడిచినప్పటికీ ఇంత వరకు చేసిన పనులకు సరైన బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు వాపోయారు. గత మూడు సంవత్సరాలలో నాలుగు పల్లె ప్రగతి కార్యక్రమాలను విజయవంతం చేశామని కానీ సర్పంచుల జీవితాలు అంధకారంలోకి వెళ్లాయని ఆవేదన వ్యక్తం చేశారు. చేసిన పనులకు బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వం కోట్లల్లో డబ్బులు ఇస్తుందని పత్రికల్లో ఇచ్చే ప్రకటనల ద్వారా ప్రజలు పనులు చేయడం లేదని తమను వేధిస్తున్నారన్నారు. పనులు చేస్తే బిల్లులు రావడం లేదని చెప్పుకుంటే పరువు పోయే చెప్పకుంటే ప్రాణం పోయే అనే స్థితిలో ఉన్నామని, దాదాపు ప్రతి చిన్న గ్రామపంచాయతీకి కూడా పది లక్షల వరకు రావాల్సి ఉందని వాపోయారు.

ఇదీ చూడండి :తెలంగాణ.. ప్రగతి పథాన.. 8 ఏళ్ల ప్రస్థానంపై ప్రభుత్వ నివేదిక

కాంగ్రెస్‌ నేత ఇంట్లో భారీ చోరీ... ఏం దొంగిలించారంటే?

ABOUT THE AUTHOR

...view details