వికారాబాద్ జిల్లాలోని పరిగి, కుల్కచర్ల, వికారాబాద్, కొడంగల్, దౌల్తాబాద్, తాండూరు తదితర మండలాల్లో రేషన్ బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఈ మండలాల్లో రేషన్ బియ్యం తిరిగి కొనుగోలు చేయడానికి బడా వ్యాపారులు.. దళారులను నియమించుకున్నారు. వీరు ఇంటింటికీ వెళ్లి కిలో రూ.15 నుంచి రూ.20 వరకు చెల్లించి తీసుకుంటున్నారు. ఇలా సేకరించిన వాటిని గిడ్డంగుల్లో నిల్వ చేసి లారీ లోడుకు సరిపడినపుడు రాత్రిపూట వేరే ప్రాంతాలకు పంపిస్తున్నారు.
- ఈ నెల 7వ తేదీన దౌల్తాబాద్ మండలంలో 9 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా అధికారులు స్వాధీనం చేసుకుని వాహన యజమానిపై కేసు నమోదు చేశారు.
- పరిగిలో 9వ తేదీన 189 క్వింటాళ్లు పట్టబడ్డాయి. ఇద్దరిపై కేసు నమోదైంది.
- వికారాబాద్, కొడంగల్‌లో 11వ తేదీన అక్రమంగా నిల్వ చేసిన బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. కర్ణాటక, హైదరాబాద్‌కు గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్నా అధికారులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. తరచుగా కొన్ని సంఘటనలు మాత్రమే వెలుగు చూస్తున్నాయి. ముడుపులు ముట్టజెప్పి కొన్ని ప్రాంతాల్లో తరలిస్తుండగా, దొంగచాటున దారిమళ్లించేవి మరికొన్ని. పట్టుకున్నప్పుడు వాహన యజమానిపై కేసులు నమోదు చేస్తున్నారే తప్ప, అసలు సూత్రదారులను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అనర్హుల చేతిలో..
వికారాబాద్ జిల్లాలో 2.35 లక్షల కుటుంబాలు నివసిస్తున్నాయని అంచనా. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల సంఖ్య మాత్రం 2.34 లక్షలకుపైనే ఉంది. మరో ఐదు వేల మందికి దరఖాస్తు చేసుకుని వేచిచూస్తున్నారు. ఇవి మంజూరయితే జిల్లాలో కుటుంబాల కంటే కార్డుల సంఖ్య అధికమవుతుంది. ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లిస్తున్న కొంత మందికి, వ్యాపారులకు తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
పరిగి కేంద్రంగా..
పెద్దఎత్తున జరుగుతున్న బియ్యం దందాకు పరిగి కేంద్ర బిందువుగా నిలిచింది. నిత్యం ఇక్కడ వందల క్వింటాళ్ల నిలువలు పట్టుబడుతున్నా, అక్రమార్కుల్లో చలనం కనిపించడం లేదు. అక్రమ రవాణా వెనుక కొన్ని పరిశ్రమల హస్తం ఉందనే ప్రచారం జరుగుతోంది. మార్కెట్‌లో బియ్యం ధరలు అధికంగా ఉండటం, రేషన్ బియ్యం విరివిగా లభిస్తుండటంతో వారి అవసరాలకు సరిపడా సేకరించేందుకు వ్యక్తులను నియమించుకుంటున్నారు. నెల తొలి వారంలో తీసుకొచ్చిన బియ్యాన్ని వెంటనే లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ఆయా పరిశ్రమల ముఠాలు సేకరించడం మొదలు పెడుతున్నాయని సమాచారం.
రేషన్ బియ్యం పట్టివేత ఏడుగురిపై కేసు
కొడంగల్: అక్రమంగా నిలువ చేసి తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని బుధవారం స్వాధీనం చేసుకున్నామని టాస్క్‌ఫోర్స్ సీఐ వెంకటగిరి తెలిపారు. కొడంగల్‌కు చెందిన కొందరు వ్యాపారులు ప్రతి నెలా లబ్ధిదారుల నుంచి కిలోకు రూ.10 చొప్పున బియ్యం కొనుగోలు చేస్తున్నారన్నారు. వాటిని ఒక చోట చేర్చి పరిగికి రవాణా చేస్తున్నారని పేర్కొన్నారు. నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు కొడంగల్‌లో నాలుగు ప్రాంతాల్లో దాడులు నిర్వహించగా, 300 క్వింటాళ్లు ఉన్నాయని తేలిందన్నారు. వాహనాలను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఏడుగురిపై కేసు నమోదు చేశామన్నారు. కొడంగల్ ఎస్సై ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
వికారాబాద్‌లో 90 క్వింటాళ్లు
అక్రమంగా తరలిస్తున్నరేషన్ బియ్యం స్వాధీనం చేసుకుని ఇద్దరిని రిమాండ్‌కు తరలించిన సంఘటన వికారాబాద్ పట్టణంలో బుధవారం జరిగింది. ఎస్‌ఐ లక్ష్మయ్య తెలిపిన ప్రకారం.. రాజీవ్‌గృహకల్పకు చెందిన నర్సింహులు రేషన్ దుకాణాల ద్వారా ప్రభుత్వం సరఫరా చేసిన రూపాయికి కిలో బియ్యాన్ని లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు 90 క్వింటాళ్లు కొనుగోలు చేశాడు. ఈ బియ్యాన్ని చేవెళ్లలో విక్రయిస్తాడన్నారు. సమాచారం మేరకు బుధవారం రాత్రి వెళ్లి తనిఖీ చేయగా, రవాణా చేయడానికి సిద్ధంగా ఉంచిన బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ సందర్భంగా ఇద్దరిని రిమాండ్‌కు తరలించామని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.