వికారాబాద్ జిల్లాలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నా, వైద్యాధికారులు వివరాలు చెప్పడంలేదు. క్షేత్రస్థాయిలో చూస్తే పరిస్థితి విషమంగా కనిపిస్తోంది. వైరస్ సోకిన బాధితులు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లకుండా చాలా మంది ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించడంతో ఇదే అదునుగా కొందరు ఇష్టానుసారం డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని ఆసుపత్రులకు అనుమతులు లేకపోయినా కొవిడ్ చికిత్స చేస్తున్నారని విశ్వసనీయమైన సమాచారం. ఇంత జరుగుతున్నా వైద్య అధికారుల పర్యవేక్షణ కొరవడింది.
జ్వరం, ఇతర లక్షణాలు ఉన్న వారు ప్రైవేట్ ఆసుపత్రికి వెళితే ముందుగా మలేరియా, టైపాయిడ్, డెంగీ పరీక్షలు సిటీస్కాన్ చేయిస్తున్నారు. కరోనా పరీక్ష కంటే సిటీస్కాన్‌లో స్పష్టంగా తెలుస్తుందని రోగులను అటుగా మళ్లిస్తున్నారు. వికారాబాద్, తాండూరు, పరిగి వంటి పట్టణాల్లో ఈ దందా భారీగా సాగుతోంది. సాధారణ రోజుల్లో సిటీస్కాన్ రూ.2 వేలకు చేసేవారు. ప్రస్తుతం పట్టణానికో ధర వసూలు చేస్తున్నారు. రూ.3,200 నుంచి రూ.3,600 వరకు తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రద్దీ, తనకు వైరస్ సోకిందనే విషయం ఎవరికీ తెలియకూడదనే భావనతో కొంత మంది ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. దీంతో వారికి యాంటిజెన్ పరీక్ష చేసి రూ.2 వేలు వసూలు చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో పది రోజులకు రూ.10 వేల ఆన్‌లైన్ వైద్యం ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చారు. బీపీ, మధుమేహం ఉన్నవారికి వివిధ రకాల పరీక్షలు చేసి వారం రోజులు చికిత్స పేరుతో రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు గుంజుతున్నారు. మరికొందరు వైద్యులు రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు సైతం ఇస్తూ, ఇళ్ల వద్దే ఉంచి వ్యాపారం ప్రారంభించారు.
నిబంధనలకు విరుద్ధంగా
దీర్ఘకాలిక జబ్బులు, వయసు ఎక్కువ ఉన్నవారు పాజిటివ్ అనగానే వణికిపోతున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవారు హోంక్వారంటైన్‌లో ఉండి ప్రభుత్వ వైద్యులు ఇచ్చిన మందులు వాడుతున్నా, జ్వరం తగ్గకపోవడం, ఆయాసం వంటి లక్షణాలు ఉన్న వారు ఆందోళనతో ప్రైవేటు వైద్యులను ఆశ్రయిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కరోనా రోగులను చేర్చుకుని చికిత్స చేస్తున్నారు. సాధారణ లక్షణాలు ఉండి, ఇతర దీర్ఘకాలిక రోగాలు లేకుండా ఉన్న వారికి పావిఫిరావిర్, లక్షణాల తీవ్రత అధికంగా ఉండి, ఇతర దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారికి రెమ్‌డెసివిర్ కోర్సు వాడుతున్నారు. ఐదు నుంచి ఏడు రోజుల ఈ చికిత్సకు రూ.లక్షన్నర నుంచి రూ.2 లక్షలు వసూలు చేస్తున్నారు. అనుమతి లేని ఆస్పత్రుల్లో పడకల కోసం పైరవీ కూడా చేయాల్సి వస్తోంది. కొందరు రెమెడెసివిర్ గ్లూకోజ్‌లో ఎక్కించుకొని, ఇంటికి వెళ్లి హోంక్వారంటైన్‌లో ఉంటున్నారు. ఈ తరహా చికిత్సకు రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారు.
ఫిర్యాదు చేస్తే పరిశీలించి చర్యలు
కరోనా రోగులకు చికిత్స చేసేందుకు జిల్లాలో 22 ఆస్పత్రులకు అనుమతి ఇచ్చాం. మిగిలిన వాటిల్లో చేర్చుకుంటే ఆస్పత్రులను సీజ్ చేస్తాం. పరీక్షలు, హోంక్వారంటైన్ కిట్లు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్, క్రిటికల్ కేర్ యూనిట్లు ఇలా అన్నీ స్థాయిల్లో ఉచితంగా చికిత్స చేస్తున్నాం. ఖరీదైన రెమ్‌డెసివిర్ వంటివి ప్రధాన ఆస్పత్రుల్లో అవసరమైన వారికి ఉచితంగా ఇస్తున్నాం. పరీక్షల సంఖ్య పెంచాం. ఇంకా ప్రైవేటు వైపు వెళితే ఆర్థిక ఇబ్బందులు తప్పవు. హోంక్వారంటైన్‌లో ఉన్నవారిని ప్రతి రెండు రోజులకు ఒకసారి సిబ్బంది ఫోన్ చేసి సలహాలు, సూచనలు అందిస్తున్నారు. ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలి.- డాక్టర్ సుధాకర్ షిండే, జిల్లా వైద్యాధికారి