కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో మార్చి 22 నుంచి వికారాబాద్ జిల్లాలో లాక్‌డౌన్ అమలవుతోంది. అప్పటి నుంచి ప్రైవేటు ఆసుపత్రులు మూతపడ్డాయి. కేవలం ప్రభుత్వాసుపత్రులు, మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మాత్రమే ప్రసూతి సేవలందుతున్నాయి.
జిల్లాలో మొత్తం 25 ప్రభుత్వ ఆస్పత్రులున్నాయి. వీటిలో తాండూరులోని జిల్లా ఆస్పత్రి, వికారాబాద్, కొడంగల్, పరిగి, మర్పల్లిలో క్లస్టర్ ఆస్పత్రి, 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. తాండూరు, వికారాబాద్, పరిగి, కొడంగల్ పట్టణాల్లోని 25 ప్రైవేటు ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్‌లు ఉన్నాయి.
ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో 748 ప్రసవ కేసులు నమోదు కాగా, 504 సాధారణ ప్రసవాలు చేశారు. మిగతా 244 మందికి రూపాయి ఖర్చు లేకుండా శస్త్ర చికిత్స నిర్వహించారు. అదే.. ప్రైవేటుకు ఆస్పత్రిలో ప్రసవానికి వెళితే శస్త్రచికిత్స పేరిట రూ.20-30వేల ఖర్చు అయ్యేది. శస్త్ర చికిత్స చేయించుకున్న మహిళలు బలహీనపడేవారు. ప్రస్తుతం ఇలాంటి సమస్యలు లేవని వైద్యులు, బాలింతలు పేర్కొంటున్నారు.