PERSON SUICIDE ATTEMPT: తన తమ్ముడిపై దాడి చేసిన వ్యక్తులపై కాకుండా తిరిగి తమపైనే కేసు నమోదు చేశారని ఓ వ్యక్తి శనివారం పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం అనంతసాగర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ట్రాక్టర్ డ్రెవర్గా అంజనేయులు విధులు నిర్వహిస్తున్నాడు. గ్రామంలో ఓ పార్టీకి చెందిన దిమ్మె రోడ్డుకు అడ్డుగా ఉండటంతో ట్రాక్టర్ నడిపేందుకు ఇబ్బందిగా ఉందని పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేశాడు.
దీంతో ఆ పార్టీకి చెందిన ఇద్దరు వ్యక్తులు అంజనేయులపై దాడి చేశారు. దీనిపై బాధితుడి అన్న వెంకట్ కుల్కచర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు దాడి చేసిన వ్యక్తులపై కాకుండా తిరిగి తమపైనే కేసు నమోదు చేశారని పోలీస్ స్టేషన్ ఎదుట వెంకట్ పెట్రోల్ పోసుకొని నిన్న ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పెట్రోల్ పోసుకుంటుండగా గమనించిన కొందరు వ్యక్తులు అతన్ని నిలువరించారు.