Revanthreddy on Hath Se Hath Jodo Yatra: 'భారత్ జోడో' యాత్రకు కొనసాగింపుగా 'హాథ్ సే హాథ్ జోడో' యాత్ర ప్రారంభించామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పేద ప్రజల పక్షాన నిలబడి భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ తెలిపిన సందేశాన్ని ప్రతి గడపకు చేరవేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట్ మండలం మదనపల్లి నుంచి 'హాథ్ సే హాథ్ జోడో' యాత్రను రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం 'హాథ్ సే హాథ్ జోడో' యాత్ర కరపత్రాలు విడుదల చేశారు.
అధికారంలోకి రావడమే లక్ష్యంగా యాత్ర : ఫిబ్రవరి 6 నుంచి 2 నెలలపాటు ఈ యాత్ర కొనసాగుతుందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు వివరిస్తామని స్పష్టం చేశారు. దిల్లీకి రాజైన తల్లికి కొడుకే అన్నట్టు టీపీసీసీ అధ్యక్షుడిని అయినా కొడంగల్ నుంచే 'హాథ్ సే హాథ్ జోడో' యాత్రను ప్రారంభించాలనే ఉద్దేశంతో అక్కడి నుంచి యాత్ర ప్రారంభించడం జరిగిందన్నారు. 9 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ప్రభుత్వం చేసిన వైఫల్యాలను ఈ యాత్ర ద్వారా ప్రజలకు వివరించడం జరుగుతుందని పేర్కొన్నారు. 2024లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ యాత్ర కొనసాగుతుందని రేవంత్ రెడ్డి అన్నారు.