వికారాబాద్ జిల్లా పరిగి మండల కేంద్రంలో రూ.5 కోట్లతో ఏర్పాటైన 30 పడకల ఆస్పత్రిని నెలరోజుల క్రితం రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి ప్రారంభించారు.
ఆస్పత్రి ప్రారంభమైంది కాబట్టి వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయనుకున్న స్థానికుల ఆశలు అడియాశలయ్యాయి. కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన ఆస్పత్రిని ఇలా ప్రారంభించి అలా మూసివేశారు. సిబ్బందిని నియమించడంలో అధికారుల నిర్లక్ష్యంతో వైద్య సేవలు పాత భవనంలోనే సాగుతున్నాయి.
వైద్యులు, నర్సింగ్, ఇతర సిబ్బందితో కలిపి మొత్తం 120 మందిని నియమించాలి. ఈ ప్రక్రియ జరగకపోవడం వల్ల వివిధ ఆస్పత్రుల నుంచి డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నవారంతా కలిసి 24 మంది మాత్రమే ఉన్నారు. పాత భవనంలోని ఆస్పత్రి చిన్నదిగా ఉండటం, సిబ్బంది కొరత వల్ల ప్రసవాలకు వికారాబాద్, హైదరాబాద్ ఆస్పత్రులకు రిఫర్ చేయాల్సి వస్తోందని వైద్యులు చెబుతున్నారు.
ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పరిగి నూతన ఆస్పత్రికి సిబ్బందిని నియమించి త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని స్థానిక ప్రజలు కోరారు.