Nursing student Shirisha murder case updated : తీవ్ర కలకలం రేపిన పారామెడికల్ విద్యార్ధిని శిరీష హత్య కేసును పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాడ్లాపూర్ గ్రామానికి చెందిన శిరీష శనివారం రాత్రి 10గంటల సమయంలో బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆదివారం ఉదయం తీవ్ర గాయాలతో ఉన్న మృతదేహం ఇంటికి సమీపంలో ఉన్న నీటి కుంటలో కనిపించింది. ఈ కేసులో బావ అనిల్‌పై అనుమానం రావడంతో పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు.
ఇప్పటివరకు హత్యా కేసు నమోదుచేసిన పోలీసులు శిరీష కుటుంబీకులు చెప్పిన వివరాల మేరకు ఆత్మహత్యా కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఇంట్లో అన్నం వండే విషయంలో తన కుమార్తెను బావ కొట్టినట్లు అదే సమయంలో తాను కూడా చేయిచేసుకున్నట్లు శిరీష తండ్రి తెలిపాడు. ఆ తర్వాత రాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగిరాలేదని తెలిపాడు. కుటుంబసభ్యుల వాంగ్మూలంపై కాడ్లాపూర్ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కచ్చితంగా యువతిని ఆమె బావే హత్యచేసినట్లు ఆందోళన చేపట్టారు.
Shirisha murder case investigation : కుటుంబీకులు వాస్తవాలు దాచిపెడుతున్నారని మండిపడ్డారు. అక్కడకు చేరుకున్న పోలీసులు గ్రామస్థులకు సర్దిచెప్పి పూర్తి పారదర్శకంగా విచారణ చేస్తున్నామని దోషులు ఎవరైనా వదిలిపెట్టబోమని హామీ ఇచ్చారు. తల్లిదండ్రుల చెప్పిన వివరాల మేరకు ఆత్మహత్యా కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతదేహంపై మరణించేంత గాయాలు లేవని.. వాస్తవాలు తెలుసుకునేందుకే మరోసారి పోస్టుమార్టం నిర్వహించినట్లు తెలిపారు. ఎఫ్ఎస్ఎల్ నివేదిక వచ్చిన తర్వాత నిజానిజాలు బయటకువస్తాయని వైద్యులు తెలిపారు. గ్రామస్థుల ఆందోళనలు, అనుమానాల నడుమే శిరీష మృతదేహానికి అంత్యక్రియలు పూర్తిచేశారు.
శిరీష తండ్రిపై గ్రామస్థుల దాడి:శిరీషది ఆత్మహత్యగా చూపే ప్రయత్నం జరుగుతోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. శిరీష తండ్రి జంగయ్యకు అన్ని తెలుసునని అంటున్నారు. ఈ మేరకు ఆయన్ను కాడ్లాపూర్ గ్రామస్థులు నిలదీశారు. ఒకనొక సమయంలో జంగయ్యపై దాడికి పాల్పడ్డారు. ఈ సమయంలో పోలీసులు జోక్యం చేసుకొని గ్రామస్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.