చిత్రకారుడి చేతిలోని ఏ వస్తువైనా అద్భుత కళాఖండంగా మారుతుంది. తన ఆలోచనలకు అందమైన రూపాన్ని ఇచ్చి ఔరా.. అనిపిస్తున్నారు ఓ యువకుడు. విరిగిపోయిన సుద్దముక్కలను అందమైన బొమ్మలుగా మలుస్తున్నారు. చింత గింజలపై ఎన్నో అపురూప చిత్రాలు గీసి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఆయనే వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్‌కు చెందిన అశోక్.
అశోక్‌కు చిన్నప్పటి నుంచి చిత్రాకళపై ఆసక్తి ఉండేది. తనలోని ప్రతిభను గుర్తించిన ఉపాధ్యాయులు ప్రోత్సహించారని తెలిపారు. చిన్న చిన్న పరికరాలతో మొదలుపెట్టి ప్రస్తుతం ఏదైనా అద్భుతంగా మలిచే స్థాయికి ఎదిగారు.
తెలంగాణ తల్లి, బతుకమ్మ ఎత్తిన మహిళలు, గిరిజన మహిళలు ధరించే వస్త్రాలు, ఆంజనేయుడు, చింత గింజలపై 30కిపైగా దేశాల చిత్రాలు గీసి ఔరా అనిపించుకున్నారు. ఉప్పు బిస్కెట్లపై వివిధ మతాలకు చెందిన చిత్రపటాలు గీశారు.