Nitrate in Groundwater : రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లోని భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్, నైట్రేట్ శాతం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. వ్యవసాయేతర ప్రాంతాలతో పోలిస్తే సాగు భూములున్న ప్రాంతాల్లోని నమూనాల్లో వీటి శాతం అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్‌జీఆర్‌ఐ) వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్, పరిగి, దోమ మండలాల పరిధిలోని దాదాపు వంద గ్రామాల్లో నీటి నమూనాలను సేకరించి నాణ్యతను విశ్లేషించింది. నైట్రేట్ 34 శాతం నమూనాల్లో ప్రమాణాలకు మించి ఉన్నట్లు గుర్తించారు. ఫ్లోరైడ్ 25 శాతం ఉన్నట్లు తేల్చారు.
ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్త డాక్టర్ సక్రం గగులోతు ఆధ్వర్యంలో ఈ పరీక్షలు నిర్వహించారు. వ్యవసాయ బోర్లు, చేతి పంపుల నీటి నమూనాలను సేకరించారు. ప్రతి లీటరు నీటిలో నైట్రేట్ 45 ఎంజీ, ఫ్లోరైడ్ 1.5 ఎంజీ కంటే ఎక్కువ ఉంటే ప్రమాణాలకు మించి ఉన్నట్లు. కాగా ఇబ్రహీంపూర్‌లో నైట్రేట్ ఆందోళనకర స్థాయిలో ఉంది. కాగా ఇక్కడ లీటరు నీటిలో 585.20 ఎంజీ ఉంది. 22 నమూనాల్లో 100 ఎంజీపై ఉన్నట్లు తేలింది. వికారాబాద్ జిల్లా పోలీసు ట్రైనింగ్ ప్రాంతాల్లో ఫ్లోరైడ్ 5.41 ఎంజీగా నమోదైంది.
పట్టణ నివాస ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ, వ్యవసాయ ఏరియాల్లో ఫ్లోరైడ్, నైట్రేట్ అధికంగా ఉన్నట్లు పరిశోధనలో గుర్తించారు. లోతుగా బోర్లు వేయడం, రసాయన పురుగు మందుల అధిక వినియోగం ఇందుకు కారణమని చెబుతున్నారు. ఈ నీటిని తాగడం వల్ల ఇక్కడి చిన్నారుల్లో చాలమంది పళ్లపై గారలు, పెద్దవాళ్లలో మోకాళ్ల సమస్యలు ఉన్నాయి. ఈ పరిశోధన గత నెలలో అంతర్జాతీయ జర్నల్ స్ప్రింగర్‌లో ప్రచురితమైంది.