కరోనా సంక్షోభంలో గత ఆరు నెలల గడ్డు కాలాన్ని అధిగమిస్తూ నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కిస్తామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. వికారాబాద్ జిల్లా తాండూరులో రూ.80 లక్షలతో నిర్మించిన ఆర్టీసీకి చెందిన 29 దుకాణాల సముదాయాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి సోమవారం ఆయన ప్రారంభించారు.
వైరస్ భయంతో ప్రయాణికుల కొరత
నష్టాల్లో ఉన్న ఆర్టీసీని కాపాడుకోవడానికి బడ్జెట్లో సీఎం కేసీఆర్ రూ.1,000 కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. ఉద్యోగులు, కార్మికులకు ప్రతి నెల రూ.100 కోట్లు వేతనాలు అందజేస్తున్నామని మంత్రి వెల్లడించారు. కరోనాకి ముందు కార్మికుల సమ్మె ప్రభావంతో ఆర్టీసీ తీవ్రంగా నష్టపోయిందని ఆయన పేర్కొన్నారు. వైరస్ భయంతో ప్రయాణికులు బస్సులో తిరగకపోవడంతో సంస్థకు సరైన ఆదాయం రాలేదని దీంతో నష్టాలను చవిచూడాల్సి వచ్చిందని వెల్లడించారు.