మెడిసిన్ ఫ్రమ్ ది స్కై(Medicine From the Sky) ప్రాజెక్టు పేరిట కార్యక్రమం అమలు చేయగా... అత్యవసర పరిస్థితుల్లో ఈ డ్రోన్ల ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. డ్రోన్ల వినియోగంతో లెక్కలేనన్ని ఉపయోగాలు ఉన్నాయన్న మంత్రి కేటీఆర్(ktr).. రాష్ట్రంలో మరిన్ని కార్యక్రమాల కోసం డ్రోన్లు వినియోగించేందుకు వీలుగా ప్రయోగాలు చేస్తున్నట్లు తెలిపారు. సాంకేతిక వినియోగంపై సీఎం కేసీఆర్ ఆరా తీస్తారని అన్నారు. సామాన్యుడికి ఉపయోగంలేని సాంకేతికత వ్యర్థమని సీఎం చెబుతారని పేర్కొన్నారు. రెండేళ్ల కిందటే దావోస్‌లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు.
మైనింగ్ లాంటి అక్రమాలకు పాల్పడే ప్రాంతాలను కట్టడి చేయొచ్చు. బేగంపేట విమానాశ్రయాన్ని ఏరోస్పేస్ శిక్షణ కేంద్రంగా తీర్చిదిద్దాలి. బేగంపేట విమానాశ్రయాన్ని ఏవియేషన్ వర్సిటీగా మార్చాలి. త్వరలో వికారాబాద్ కొత్త కలెక్టరేట్‌ను సీఎం ప్రారంభిస్తారు.
- ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్
ఎమర్జింగ్ టెక్నాలజీని ఎంతో ప్రోత్సహిస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. అధునాతన టెక్నాలజీతో మందులను సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో డ్రోన్ల ద్వారా మందులు, రక్తం సరఫరా చేయనున్నట్లు వివరించారు. ఆరోగ్య రంగంలోనే కాదు అనేక రంగాల్లో డ్రోన్ వాడొచ్చని అన్నారు. మహిళల భద్రత కోసం కూడా డ్రోన్లను వాడుతున్నామని గుర్తు చేశారు. అమ్మాయిలను వేధించే వాళ్లు డ్రోన్ చప్పుళ్లకే భయపడతారని వెల్లడించారు.
రెండు సంవత్సరాల కిందట దావోస్‌లో వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్ ప్రతినిధులు మనల్ని అడిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్(cm kcr) నాయకత్వంలో తెలంగాణ చాలా పురోగమనశీల రాష్ట్రంగా పేరు తెచ్చుకుంది. మరి ఈ రాష్ట్రంలో ఇలాంటి కొత్త ప్రయోగాలు చేస్తే భారతదేశానికే మీరు ఆదర్శంగా నిలబడతారు. మీరెందుకు ప్రయత్నం చేయకూడదని అడిగారు. మేమందరం అక్కడే ఒప్పుకున్నాం. రెండేళ్ల తర్వాత అయినా ఈ కొవిడ్(covid) వల్ల కొంత జాప్యం జరిగినప్పటికీ ఈ మూడు డ్రోన్ స్టార్టప్స్‌తో ఈ కార్యక్రమం చేయడం సంతోషంగా ఉంది. ఇక్కడ డ్రోన్ టేకాఫ్ అయ్యి... అందులో మనకు కావాల్సిన వ్యాక్సిన్, కావాల్సిన మందులను, అవసరమైతే రక్తాన్ని కూడా తీసుకొని ఏ ట్రాఫిక్ సమస్య లేకుండా ఐదు నిమిషాల్లో ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్‌కు పోయి... అక్కడ ల్యాండ్ అయింది ఇప్పుడే. అక్కడ ఉండే డాక్టర్లు, నర్సులు ఆ మందులు తీసుకొని పేషెంట్లకు ఇవ్వొచ్చు. అవసరమైతే కొండలు, గుట్టలు, రోడ్లు లేని ప్రదేశాలకు కూడా అత్యవసర పరిస్థితుల్లో రక్తం చేరవేయాల్సి వచ్చినా... ఇవన్నీ కూడా ఇట్లాంటి అధానాతనమైన సాంకేతికపరిజ్ఞానం ద్వారా చేరవేయడానికి ఈ రోజు తెలంగాణ భారతదేశానికే ఆదర్శంగా నిలబడుతోంది.