ఆ గ్రామంలో వెయ్యేళ్ల చరిత్ర ఉన్న అపురూప సంపద నిర్లక్ష్యంగా పడి ఉంది. వికారాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న కన్కల్ గ్రామంలో దాదాపు 100 శిల్పాలు ఉన్నాయి. నల్లమల నేచర్ ఫౌండేషన్ అధ్యక్షుడు పట్నం కృష్ణంరాజు ఇచ్చిన సమాచారం మేరకు పురావస్తు పరిశోధకుడు, కల్చరల్ సెంటర్ సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి ఆదివారం ఈ శిల్పాల్ని పరిశీలించారు.
చెదిరిపోతున్న వెయ్యేళ్ల చరిత్ర..! సంరక్షించేదెవరు? - శతాబ్దాల విగ్రహలు
చరిత్ర అదీ ఓ అపురూప ఘట్టం. అందుకు ఆనవాళ్లుగా మనరాష్ట్రంలో ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి. వాటిని సంరక్షించడంలో మాత్రం ప్రభుత్వాల నిర్లక్ష్యమూ ఉంది. వికారాబాద్‌కు అతి సమీపంలోని కన్కల్ గ్రామంలో 13వ శతాబ్దం నాటి వందల శిల్పాలను అధికారులు పట్టించుకోకుండా వదిలేశారు. వెయ్యేళ్ల చరిత్ర గల విగ్రహాలు పాలకుల నిర్లక్ష్యానికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.
గ్రామంలోని గణేశ, వీరభద్ర, ఆంజనేయ, పోచమ్మ ఆలయాల వెలుపల, పంట పొలాల్లో శిల్పాలు.. నమాజు గడ్డ దగ్గర రెండు శాసనాలున్నాయి. రాష్ట్రకూటులు, కల్యాణ చాళుక్యలు, కాకతీయుల, విజయనగర రాజుల కాలం (క్రీ.శ.9-16వ శతాబ్దం) నాటి శిల్పాలు వాటిలో ఉన్నాయి. వీటిలో 9వ శతాబ్దం నాటి వీరభద్ర, జంటనాగదేవతలు, పార్శ్వనాథ జైనవిగ్రహం..10వ శతాబ్దం నాటి అగస్త్యముని, భద్రకాళి శిల్పాలు.. 12వ శతాబ్దం నాటి భిన్నమైన నంది.. 13వ శతాబ్దం నాటి వీరుల (వీరగల్లులు)శిల్పాలు.. మొత్తంగా వెయ్యేళ్ల శిల్పకళకు అద్దం పడుతున్నాయని కల్చరల్ సెంటర్ సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి వివరించారు.