- మధ్యాహ్న భోజనం వండటం ఇష్టం లేదంటూ ఏజెన్సీ మహిళలు బొంరాస్‌పేట మండలం చౌదర్‌పల్లి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు చెప్పారు. ఈ విషయాన్ని ఎంఈఓ, మండలపరిషత్ అధికారులకు తెలియజేశారు. వారు వచ్చి మహిళలకు నచ్చజెప్పడంతో సమ్మతించారు.
- కొడంగల్ పట్టణం బాలుర ఉన్నతపాఠశాలలో 530 మంది విద్యార్థులకు నలుగురు వంట చేస్తున్నారు. ఇందుకోసం నెలకు సుమారుగా రూ.62 వేలు ఖర్చవుతోంది. పెరిగిన ధరలు, సకాలంలో అందని బిల్లులతో వంట చేయటం వీలు కాదని ఏజెన్సీవారు చెప్పారు. దీంతో కిరాణ దుకాణంలో ప్రధానోపాధ్యాయుడు మధ్యవర్తిగా ఉంటూ తన పేరుతో ఖాతా రాయించి నిత్యావసరాలు తెప్పిస్తున్నారు.
వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా బడుల్లో మధ్యాహ్న భోజనాలు కొనసాగుతున్నాయి. కరోనా కారణంగా ఏడాదిన్నరగా పాఠశాలలు మూతపడటంతో ఏజెన్సీల మహిళలు ఇతర పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం పాఠశాలలు ప్రారంభమైనా వంట చేసేందుకు కొందరు ముందుకు రావటంలేదు. గతంలోని నిత్యావసరాలు, కూరగాయల ధరల్లో చాలా వ్యత్యాసం ఉంది. డీజిల్ ధరలు పెరగటంతో రవాణా వ్యవస్థపై ప్రభావం చూపుతుండగా ఏడాది కిందట కిలో మంచినూనె రూ.108 ఉండగా ప్రస్తుతం రూ.158 విక్రయిస్తున్నారు. నిత్యావసరాలతో పాటుగా కోడిగుడ్డు ధరలు భారీగా పెరిగాయి. ప్రభుత్వం చెల్లిస్తున్న డబ్బులు ప్రస్తుతం ఉన్న ధరలకు ఏమాత్రం సరిపోవటంలేదని అంటున్నారు. ఇక బిల్లుల చెల్లింపుల్లో జాప్యం కారణంగా గిట్టుబాటు లేదంటూ మానేస్తున్నారు.
అంగన్‌వాడీల్లో రూ.7,800... పాఠశాలలో రూ.వెయ్యి
అంగన్‌వాడీ కేంద్రాల్లోని ఆయాలకు ప్రభుత్వం నెలకు రూ.7,800 వేతనం ఇస్తోంది.. ప్రభుత్వ పాఠశాలల్లో 100 మంది లోపు విద్యార్థులుంటే ఒక్కరే వంట చేస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం గౌరవ వేతనంగా వెయ్యి రూపాయలు అందిస్తోంది. కూలీలుగా గ్రామాల్లో పనులకు వెళితే రోజుకు కనీసం రూ.300 పైనే ఇస్తున్నారు. పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో పాటుగా ప్రభుత్వం సరకులకు ఇస్తున్న డబ్బులు వాటికే సరిపోవటం లేదని ఏజెన్సీల నిర్వాహకులు వాపోతున్నారు. వంట చేస్తున్న ఏజెన్సీల్లోని వారికి ఒక్కొక్కరికీ కనీసం నెలకు రూ.6వేలు చెల్లించాలని కోరుతున్నారు.
భారంగా మారింది
మధ్యాహ్నం భోజనానికి వంట చేయడం ఇబ్బందిగా మారింది. కిరాణం, కూరగాయలు కొనుగోలు చేసుకుంటూ వంద మందిలోపు విద్యార్థులకు ఒక్కరమే చేయటం భారమే. నెలనెలా పైసలు సకాలంలో ఇవ్వకుంటే గిట్టుబాటు కావటంలేదు. కనీసం నెలకు రూ.6 వేలు గౌరవ వేతనంగా ఇవ్వాలి.